జనసేన (Jana Sena Party) రైల్వే కోడూరు (Railway Koduru) ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar) వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. విచారణ కమిటీ ఏర్పాటు చేసి రెండు వారాలు దాటినా ఇప్పటికీ నివేదిక వెలువడకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ అంశంపై ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ జనరల్ బాడీ సమావేశంలోనూ అరవ శ్రీధర్ వ్యవహారంపై ఆయన సీరియస్ అయినప్పటికీ, విచారణ నివేదిక మాత్రం ఇంకా సిద్ధం కాలేదు.
గత నెల 27న వీడియోలు బయటకు వచ్చినప్పటికీ ఎమ్మెల్యేపై చర్యలు లేకపోవడంపై విపక్షాలు ప్రశ్నలు సంధిస్తున్నాయి. అరవ శ్రీధర్‌ను కాపాడే ప్రయత్నమే జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విచారణ కమిటీ మరోసారి రైల్వే కోడూరులో పర్యటించనుంది.
పోలీసులు, అధికారుల నుంచి పూర్తి సమాచారం సేకరించి వాస్తవాలు వెలుగులోకి తేవడమే లక్ష్యమని కమిటీ సభ్యులు చెబుతున్నారు. అవసరమైతే మూడోసారి కూడా పర్యటనకు సిద్ధమని వెల్లడించారు. ఇదిలా ఉండగా, బాధితురాలు వీణా (Veena) రోజుకొక వీడియో విడుదల చేస్తూ న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్‌ను కోరుతోంది.
ఇన్ని పరిణామాల మధ్య కూడా పార్టీ అధిష్టానం నివేదిక కోసం ఎదురుచూడటం అంటే, ఈ నివేదిక అనేది ఒక పోలిటికల్ డ్రామాగా కనిపిస్తుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అలాగే ఈ వ్యవహారాలపై జనసేన ప్రవర్తిస్తున్న తీరు కూడా విపక్షాల ఆగ్రహానికి కారణమవుతోంది.







