తెలంగాణలో (Municipal) మున్సిపల్ ఎన్నికల ఓట్ల (Votes) లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఇప్పటికే 136 కౌంటింగ్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ప్రస్తుతం సాధారణ బ్యాలెట్ల లెక్కింపు కొనసాగుతుండగా, కొన్ని మున్సిపాలిటీల తుది ఫలితాలు (Results) వెలువడ్డాయి. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ (Congress Party) స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండగా, కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్(BRS) కూడా బలమైన పోటీ ఇచ్చింది.
ఎక్కడ ఎవరి ఆధిపత్యం?
నల్గొండ (Nandikonda) జిల్లా నందికొండలో 12 వార్డుల్లో 11 గెలుచుకుని కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం (Gaddapotharam)లో 18లో 14 వార్డులు దక్కించుకుని బీఆర్ఎస్ పూర్తి ఆధిపత్యాన్ని చాటింది. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో బీఆర్ఎస్ 16లో 9 స్థానాలు గెలుచుకోగా, దేవరకద్రలో మాత్రం హంగ్ పరిస్థితి నెలకొంది.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల (Nereducharla)లో 15లో 9 వార్డులు గెలుచుకుని కాంగ్రెస్ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. కోహీర్లో పోటీ సమతుల్యంగా సాగగా, అయిజలో బీఆర్ఎస్ 20లో 13 వార్డులు గెలిచి స్పష్టమైన మెజార్టీ సాధించింది. మరిపెడ, సుల్తానాబాద్, డోర్నకల్, హాలియా, అశ్వారావుపేట వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభంజనం కనిపించింది.
మొత్తంగా చూస్తే రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యం లభిస్తున్నప్పటికీ, కొన్ని కీలక మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గట్టి పోటీ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మిగిలిన ఫలితాలు వెలువడిన తర్వాతే పూర్తి చిత్రమేమిటో స్పష్టమవుతుంది.








