ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) చరిత్రలోనే కాకుండా దేశ రాజకీయ చరిత్రలో కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన మహనీయుడు దామోదరం సంజీవయ్య (Damodaram Sanjivayya). రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అణగారిన వర్గాల ఆశలకు ప్రతీకగా నిలిచిన ఆయన జయంతి సందర్భంగా వైఎస్సార్‌సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) ఘనంగా నివాళులు అర్పించారు. పేదల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత నాయకుడిగా సంజీవయ్యను ఆయన కొనియాడారు.
సంజీవయ్య పాలనలో అనేక సంస్కరణలు రూపుదిద్దుకున్నాయి. వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాల్లో 14% రిజర్వేషన్‌తో పాటు ప్రమోషన్లలో కూడా 14% రిజర్వేషన్ ప్రతిపాదించడం ద్వారా సామాజిక న్యాయానికి బాటలు వేశారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను 14% నుంచి 17%కు, బీసీల రిజర్వేషన్లను 24% నుంచి 33%కు పెంచే చర్యలు చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ ఖాళీలను ఇతరులకు ఇవ్వకుండా రద్దు చేయడం ద్వారా హక్కులను కాపాడారు.
పరిశ్రమల అభివృద్ధికి పునాది వేస్తూ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ వంటి కీలక పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం ఇచ్చారు. BHEL సంస్థ స్థాపనతో పాటు హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సుమారు రెండు వేల ఎకరాల భూ సమీకరణ జరిగింది ఈయన పాలనలోనే. 1960 అక్టోబర్ 3న హైదరాబాద్–సికింద్రాబాద్ నగరాలను కలిపి GHMC ఏర్పాటు చేయడం ఆయన పాలనలో జరిగిన ముఖ్య ఘట్టం.
సామాజిక భద్రత రంగంలో వృద్ధాప్య పింఛన్లు, వితంతువుల పింఛన్లు ప్రవేశపెట్టి పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారు. అవినీతి నివారణ చర్యలు చేపట్టి (ACB) ప్రభుత్వ వ్యవస్థలో పారదర్శకతకు శ్రీకారం చుట్టారు. బలహీన వర్గాల విద్యా పథకాలు, కార్మికులకు బోనస్‌లు, న్యాయ వేతనాల అమలు ద్వారా కార్మిక సాధికారతకు దోహదపడ్డారు.
గజులదిన్నె, వంశాధార, పులిచింతల, వరదరాజుల స్వామి వంటి జలవనరుల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఆరు లక్షల ఎకరాల బంజరు భూములను పేదలకు పంచి భూహక్కులను అందించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగులోనే ఉండాలని ఉత్తర్వులు జారీ చేసి భాషా గౌరవాన్ని పెంపొందించారు. లలితకళా అకాడమీ ఏర్పాటు ద్వారా సాంస్కృతిక రంగానికీ ప్రోత్సాహం ఇచ్చారు.
కాపులను బీసీల్లో చేర్చే నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఆ జాబితాను హైకోర్టు రద్దు చేయడం రాజకీయ చర్చలకు దారితీసింది. అయినప్పటికీ, సామాజిక న్యాయం, సమానత్వం, అభివృద్ధి అనే లక్ష్యాలతో సాగిన సంజీవయ్య పాలన ఇప్పటికీ చరిత్రలో విశిష్టంగా నిలిచింది.






