పల్నాడు జిల్లాలో ఎగువ ప్రాంత ప్రజల దశాబ్దాల కల అయిన వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి (Varikapudisela Lift Irrigation) తాజా రాష్ట్ర బడ్జెట్‌లోనూ (State Budget) నిధులు (Funds) కేటాయించకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికల ముందు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు (Chandrababu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వకపోవడం పల్నాడు ప్రజల్లో నిరాశను కలిగించింది.
వెల్దుర్తి, దుర్గి, బొల్లాపల్లి మండలాలు (పల్నాడు జిల్లా) మరియు పుల్లల చెరువు మండలం (ప్రకాశం జిల్లా)లకు సాగు, త్రాగునీటి అవసరాల పరంగా ఈ ప్రాజెక్ట్ అత్యంత కీలకంగా భావించబడుతోంది. ఫ్లోరైడ్ సమస్యలు, కరువు, వలసలతో ఇబ్బంది పడుతున్న ఈ మెట్ట, గిరిజన ప్రాంతాలకు ఇది జీవనాధారంగా గుర్తించబడింది. నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో ఖోస్లా కమిటీ కూడా ప్రత్యేక రాయితీలు సూచించినప్పటికీ, ప్రాజెక్ట్ పదే పదే నిర్లక్ష్యానికి గురైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
1996లో శిరిగిరిపాడు సమీపంలో శంకుస్థాపన జరిగినా, తదుపరి సంవత్సరాల్లో పురోగతి లేకపోవడం విమర్శలకు దారితీసింది. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి (YS Rajasekhara Reddy) గారు గంగలకుంట వద్ద పునఃశంకుస్థాపన చేసి రూ.100 కోట్లు విడుదల చేశారు. బచావత్ అవార్డు ప్రకారం 10 వేల ఎకరాలకు సాగునీటి అనుమతి ఉందని పేర్కొంటూ ప్రాజెక్టును విస్తరించాలనే ఉద్దేశాన్ని వెల్లడించారు. అయితే ఆయన ఆకస్మిక మరణంతో పనులు నిలిచిపోయాయి.
రాష్ట్ర విభజన అనంతరం 2015లో చంద్రబాబు ప్రభుత్వ నేత్రుత్వంలో ప్రాజెక్ట్ రద్దు ప్రకటన వెలువడగా, ప్రతిపక్షనేత జగన్(Jagan) నిర్వహించిన ధర్న ఫలితంగా 2019 ఎన్నికల ముందు జి.ఓ. నెం.104 ద్వారా రూ.340 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేయబడ్డాయి. అయితే పర్యావరణ, అటవీ అనుమతులపై నాటికి స్పష్టత లేదు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు సాధించి, 2023 నవంబర్ 15న తొలి దశ పనులను రూ.340.26 కోట్లతో ప్రారంభించారు. పైప్డ్ ఇరిగేషన్ విధానంలో 24,900 ఎకరాలకు నీరు అందించే లక్ష్యంతో పనులు ప్రారంభమయ్యాయి.
అయితే సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో ప్రాజెక్ట్ భవిష్యత్తుపై మళ్లీ అనిశ్చితి నెలకొంది. బడ్జెట్‌లో నిధుల కేటాయింపు లేకపోవడం ప్రజల్లో ఆందోళనకు కారణమైంది. పల్నాడు ప్రజల 70 ఏళ్ల స్వప్నం సాకారం అవుతుందా? లేక మళ్లీ రాజకీయ హామీలకే పరిమితమవుతుందా? అన్న ప్రశ్నలకు సమాధానం కోసం పల్నాడు ప్రాంత ప్రజలు ఎదురుచూస్తున్నారు.






