కూటమి ప్రభుత్వం (Coalition Government) ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌పై సీపీఎం(CPM) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. ఈ బడ్జెట్ ‘దృశ్యం’ సినిమా (Drishyam Movie) మాదిరిగా బయటకు ఒకలా కనిపించినా, లోపల అసలు పరిస్థితి భిన్నంగా ఉందని పార్టీ నేతలు ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి భారీ స్థాయిలో పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నప్పటికీ, బడ్జెట్లోని గణాంకాలు మాత్రం అభివృద్ధి లేకపోవడాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే (Andhra Pradesh) వచ్చాయని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శించారు.
బడ్జెట్లో (Budget) ఆదాయం తగ్గిపోతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, కోతలపై కోతలు విధించడం ద్వారా సంక్షేమ రంగాలను నిర్లక్ష్యం చేస్తున్నారని సీపీఎం ఆరోపించింది. గత రెండేళ్ల పాలనలో రాష్ట్ర అభివృద్ధి కనిపించలేదని, కౌలు రైతులు, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి వంటి కీలక హామీలను ప్రస్తావించకపోవడం దురదృష్టకరమని పేర్కొంది. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండానే అన్నీ అమలు చేశామని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని మండిపడింది.
అమృత్, స్మార్ట్ సిటీ నిధుల వినియోగంపై పారదర్శకత లేదని, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులు దిగజారిపోయాయని, దోమల సమస్యలు అధికమై ప్రజారోగ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం అందక ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటుచేసుకోవడం, విద్యార్థులు ఆసుపత్రుల పాలవడం, మరికొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొంది. ఈ పరిస్థితులన్నీ పూర్తిగా కూటమి ప్రభుత్వ పరిపాలనా వైఫల్యమేనని సీపీఎం తీవ్రంగా విమర్శించింది.






