రెండు రోజుల విరామం అనంతరం ఉదయం 11 గంటలకు పునఃప్రారంభమైన ఏపీ శాసనమండలి సమావేశాలు (AP Legislative Assembly Sessions) ప్రారంభం కాగానే ఉద్రిక్తంగా మారాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సభ్యులు తిరుమలలో కల్తీ నెయ్యి సరఫరా అంశంపై తక్షణ చర్చ జరపాలని పట్టుబట్టడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. హెరిటేజ్ మరియు ఇందాపూర్ డెయిరీల ద్వారా టీటీడీ(TTD)కి నెయ్యి సరఫరా విషయంలో అనుమానాస్పద అంశాలు ఉన్నాయని ఆరోపిస్తూ వాయిదా తీర్మానం ఇచ్చినా, ఛైర్మన్ దానిని తిరస్కరించారు. దీంతో సభ్యులు ప్లకార్డులతో పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగగా, పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది.
చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ (Heritage Foods) సంస్థ వెబ్‌సైట్‌లోని మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ల వివరాలను ప్రస్తావిస్తూ, ఇందాపూర్ డెయిరీ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (Indapur Dairy Milk Products Ltd) సంస్థ భువనేశ్వరి (Bhuvaneshwari) చిత్రంతో ప్రస్తావించబడిందని వైసీపీ నేతలు పేర్కొన్నారు. 2014లో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మదర్ డెయిరీ యూనిట్‌తో కలిసి టీటీడీకి లక్షల కిలోల నెయ్యి తక్కువ ధరకు సరఫరా చేసిన, అనంతరం భారీ మొత్తాల కాంట్రాక్టులు పొందిందని ఆరోపించారు. 2015లో రూ.278కే కిలో నెయ్యి సరఫరా చేసిన అదే సంస్థ, ఇప్పుడు రూ.658కు టెండర్ దాఖలు చేయడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
వెబ్సైట్లో ఇందాపూర్ సంస్థను హెరిటేజ్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, హెరిటేజ్ పేరును బయటకు రానీయకుండా ఇందాపూర్ పేరుతో టీటీడీకి నెయ్యి సరఫరా జరిగిందా అనే అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ లావాదేవీల వెనుక ఉన్న వాస్తవాలను ప్రభుత్వం స్పష్టం చేయాలని, ముఖ్యమంత్రి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశం ప్రజల్లో విస్తృత చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో శాసనమండలిలో సమగ్ర చర్చ జరగాలని వైయస్సార్సీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే వాయిదా తీర్మానం తిరస్కరించడంతో ఆందోళన మరింత తీవ్రరూపం దాల్చి, చివరకు సభ వాయిదా పడింది.






