మాజీ మంత్రి, అంబటి రాంబాబు (Ambati Rambabu) జైలు నుండి విడుదల కావడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చకు దారి తీసింది. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి (YSR Congress Party) వ్యతిరేకంగా నిబంధనలకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) గోరంట్ల ప్రాంతంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం, ఆ సందర్భంగా చోటుచేసుకున్న వాగ్వాదాలు, పరస్పర దూషణలు ఒక్కసారిగా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. ఈ పరిణామాల మధ్య అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేయడం, అనంతరం ఆయన నివాసంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి నిప్పు పెట్టడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
జనవరి 31న అరెస్టు చేయబడిన అంబటిపై పలు కేసులు నమోదు చేసి జైలులోనే ఉంచేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందనే విమర్శలు వ్యక్తమయ్యాయి. సీనియర్ నాయకుడిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే రాజకీయ ఉద్దేశ్యాలతో వేదింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి. ఒక కేసులో బెయిల్ లభించినప్పటికీ మరొక కేసులో రిమాండ్ విధించేలా పాత కేసులను వెలికితీసిన చర్యలు ప్రజల్లో చర్చనీయాంశమయ్యాయి.
అయితే నమోదు చేసిన అన్ని కేసుల్లోనూ కోర్టులు బెయిల్ మంజూరు చేయడంతో, 18 రోజుల అనంతరం అంబటి రాంబాబు జైలు నుండి విడుదలయ్యారు (Released). విడుదల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం తనపై ఎన్ని కేసులు పెట్టినా “ఐ డోంట్ కేర్” (I Don’t Care) అంటూ ధైర్యంగా ప్రకటించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అనైతిక చర్యలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.
ఇకపై ఆయన మరింత దూకుడుతో కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడిని కొనసాగిస్తారా? ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ఎలా ప్రభావితం చేస్తాయి? అన్న అంశాలు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.






