ఇరాన్రా (Iran) జకీయ వర్గాల్లో భారీ ప్రకంపనలు రేగుతున్నాయి. దేశ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) (86) మృతి చెందినట్లు అక్కడి అధికారిక మీడియా ప్రకటించింది. అమెరికా–ఇజ్రాయెల్ (United States-Israel) సంయుక్త సైనిక దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం బయటకు వచ్చింది. ఈ పరిణామంతో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
దాడి వివరాలపై ఇరాన్ మీడియా వెల్లడించిన సమాచారం ప్రకారం, శనివారం అర్ధరాత్రి ఖమేనీ నివాసం మరియు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని భారీ బాంబుదాడి జరిగింది. దేశ అత్యున్నత నాయకులతో కీలక భేటీ జరుగుతున్న సమయంలోనే ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. దాదాపు 30 బాంబులు ప్రయోగించారని వార్తలు చెబుతున్నాయి. ఈ ఘటనలో ఖమేనీతో పాటు పలువురు ఉన్నత స్థాయి సైనికాధికారులు కూడా మృతిచెందినట్లు పేర్కొంటున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) ముందుగానే ఖమేనీ మరణాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. ఇరాన్ అణు కార్యక్రమాలను అడ్డుకోవడం, అక్కడి పాలనలో మార్పులు తీసుకురావడమే ఈ దాడి లక్ష్యమని అమెరికా వర్గాలు వెల్లడించాయి.
ఈ దాడిలో ఖమేనీ కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు కూడా మృతిచెందినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. ఖమేనీ మరణంపై ఇరాన్ ప్రభుత్వం 40 రోజులపాటు సంతాప దినాలు, 7 రోజుల జాతీయ సెలవులు ప్రకటించింది.
ఖమేనీ మరణంతో ఇరాన్‌లో తదుపరి సుప్రీం లీడర్ ఎవరన్న అంశం కీలకంగా మారింది. కొత్త నాయకుడిని ఎంపిక చేసే బాధ్యత అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్‌పై ఉంది. రాబోయే రోజుల్లో ఇరాన్ రాజకీయాల్లో మరిన్ని కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.






