నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్‌పై (Anasuya Bharadwaj) సోషల్ మీడియాలో (Social Media) జరుగుతున్న వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమెపై అసభ్యకర పోస్టులు (Objectionable Posts) చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
వ్యూస్ కోసం మార్ఫింగ్ పోస్టులు
కడప జిల్లాకు చెందిన జనార్దన్ (Janardhan) అనే వ్యక్తి సోషల్ మీడియాలో అనసూయను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర పోస్టులు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యూస్, ఫాలోవర్లు పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ (Morphing) చేసి అసభ్యకరంగా ఎడిట్ చేస్తూ పోస్టులు పెడుతున్నట్లు విచారణలో బయటపడింది.
తనపై జరుగుతున్న ఈ డిజిటల్ వేధింపులను తీవ్రంగా పరిగణించిన అనసూయ గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి కడపలో అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో తనే ఆ పోస్టులు పెట్టినట్లు జనార్దన్ అంగీకరించినట్లు సమాచారం. కేవలం సోషల్ మీడియాలో రీచ్ కోసం సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకున్నానని అతడు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటన సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.






