తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) మరో కీలక పరిణామానికి తెరలేపుతూ కవిత (Kavitha) త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని (New Political Party) ప్రకటించనున్నట్లు వెల్లడించారు. గత కొంతకాలంగా మౌనంగా ఉన్న ఆమె, తన భవిష్యత్ కార్యాచరణపై స్పష్టత ఇస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
సర్వోదయ సిద్ధాంతంతో కొత్త పార్టీ
పార్టీ అజెండాపై ఇప్పటికే విస్తృతంగా కసరత్తు జరుగుతోందని కవిత తెలిపారు. మహాత్మా గాంధీ (Mahatma Gandhi) సర్వోదయ (Sarvodaya) సిద్ధాంతాన్ని (Ideology) అధ్యయనం చేస్తూ అదే దిశగా పార్టీని ముందుకు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. మంచి ముహూర్తం చూసుకుని పార్టీ పేరు, ఇతర వివరాలను అధికారికంగా ప్రకటిస్తానని పేర్కొన్నారు. పార్టీ కార్యాలయం కోసం స్థలాన్ని కూడా అన్వేషిస్తున్నామని వెల్లడించారు.
తన రాజకీయ పోరాటం ఎవరితో ఉంటుందో స్పష్టంగా చెబుతూ డాడీ (Daddy), మోడీ (Modi), చిన్న మోడీపై (Small Modi) పోరాటం కొనసాగుతుందని కవిత అన్నారు. ఎవరితోనూ రాజీ పడే ప్రసక్తే లేదని, కొత్త పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్తో ఉన్న విభేదాలను కాంగ్రెస్ పార్టీ (Congress Party), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారని ఆమె ఆరోపించారు. అసెంబ్లీలో కూడా తన అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు.
శ్రీరామనవమి తర్వాత పార్టీ ప్రకటన ఉండే అవకాశముందని కవిత తెలిపారు. అంతకంటే ముందే జాతీయ స్థాయి నాయకులను కలుసుకుని మద్దతు కూడగట్టనున్నట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన యువతకు తన పార్టీలో ప్రాధాన్యం ఇస్తానని ప్రకటించారు.
తన పార్టీ ప్రభావం ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా ఉంటుందని కవిత అంచనా వేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పోటీ చేయాలని ప్రజలు కోరుతున్నారని, ఇటీవల వనపర్తి నుంచి కూడా పోటీ చేయాలని కార్యకర్తలు సూచించినట్లు వెల్లడించారు.






