బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే (Sonali Bendre) కుటుంబం భూమి వివాదంలో చిక్కుకుంది. పుణె జిల్లాకు చెందిన రైతు చంద్రకాంత్ షిండే (Chandrakant Shinde), తమ 30 గుంటల భూమిని నటి భర్త గోల్డీ బేహల్ (Goldie Behl) అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అంతేకాకుండా తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.
1957 నుంచి వారసత్వ భూమి.. కోర్టులో కేసు
రైతు (Farmer) చంద్రకాంత్ షిండే తెలిపిన వివరాల ప్రకారం, 1957 నుంచి తమ కుటుంబానికి వారసత్వంగా వస్తున్న సుమారు 30 గుంటల భూమిని అక్రమంగా కొనుగోలు చేసి స్వాధీనం చేసుకున్నారని ఆరోపించాడు. సుమారు 32,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ భూమిలో అనుమతి లేకుండా నిర్మాణ పనులు కూడా కొనసాగుతున్నాయని పేర్కొన్నాడు.
తన హక్కులను పూర్తిగా పట్టించుకోకుండా భూమిని ఆక్రమించడమే కాకుండా, తమ కుటుంబాన్ని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని కూడా ఆరోపించాడు. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. న్యాయం కోసం వడగావ్ మావల్ సివిల్ కోర్టును (Vadgaon Maval Civil Court) ఆశ్రయించినట్లు వెల్లడించాడు.
ఆరోపణలు ఖండించిన నటి
ఈ ఆరోపణలపై నటి సోనాలి బెంద్రే (Sonali Bendre), ఆమె తరఫు న్యాయవాదులు తీవ్రంగా స్పందించారు. భూమి కొనుగోలు పత్రాల్లో తన పేరు ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధమని, డబ్బుల కోసం దురుద్దేశంతో చేసినవేనని పేర్కొన్నారు.
నటి తరఫు న్యాయవాది రాజు షిండే (Raju Shinde) మాట్లాడుతూ, ఇదే విషయంపై రైతు గతంలో తహసీల్దార్, సబ్ డివిజనల్ అధికారుల వద్ద పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అవన్నీ తిరస్కరించబడ్డాయని తెలిపారు.
ఈ కేసును పరిశీలించిన కోర్టు, సోనాలి బెంద్రే, గోల్డీ బేహల్‌తో పాటు మరికొందరిని ప్రతివాదులుగా చేర్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.






