ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నైతిక విలువలు, పారదర్శకతకు ప్రతీకగా నిలుస్తామని చెప్పుకున్న జనసేన పార్టీ, ప్రస్తుతం వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. ప్రజల విశ్వాసాన్ని సంపాదించడానికి ‘నిజాయితీ రాజకీయాలు’ అనే నినాదంతో ముందుకొచ్చిన ఈ పార్టీపై, ఇప్పుడు అవినీతి, దౌర్జన్యం, అధికార దుర్వినియోగం వంటి తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
జనసేన పార్టీ కూటమిలో భాగస్వామిగా అధికారంలోకి వచ్చిన తరువాత పరిస్థితులు మరింత విషమించాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇసుక, మట్టి, గ్రావెల్ వంటి ప్రకృతి వనరుల వినియోగంలో అక్రమాలు, మద్యం, రేషన్ వ్యవస్థల్లో అవినీతి, అలాగే లంచాల వ్యవహారాలు విస్తృతంగా పెరిగాయని ప్రతిపక్షాలు మాత్రమే కాదు, ప్రజల మధ్య కూడా చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలు చివరకు రాష్ట్రపతికి ఫిర్యాదులు వెళ్లే స్థాయికి చేరుకున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌పై వచ్చిన ఆరోపణలు ఈ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచాయి. భూదాన్ భూముల వ్యవహారాల్లో అక్రమాలు, కేసుల పరిష్కారంలో లంచాలు తీసుకోవడం, ప్రభుత్వ బదిలీల్లో జోక్యం వంటి ఆరోపణలు తీవ్రమైన చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారాల్లో ఆయన కుటుంబ సభ్యులు, అనుచరుల ప్రమేయం ఉందని ఫిర్యాదులు వెల్లడి కావడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసింది.
నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవిపై ఆర్థిక అక్రమాల ఆరోపణలు కూడా సంచలనం రేపుతున్నాయి. ఆస్తి పన్ను బకాయిల వివాదం నుంచి ప్రారంభమైన విమర్శలు, ఎన్నికల ఖర్చుల కోసం ‘వేతనాల రౌండ్ ట్రిప్పింగ్’ ఆరోపణల వరకు వెళ్లాయి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ ఆదేశించిందనే వార్తలు పార్టీలో అంతర్గతంగా చర్చకు దారితీశాయి. అదనంగా, అధికారిక కార్యక్రమాల్లో కుటుంబ సభ్యుల జోక్యం పెరిగిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన ఘటనలు మహిళా భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒక మహిళపై లైంగిక వేధింపులు, అనంతరం దాడి జరగడం వంటి ఆరోపణలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మహిళా రక్షణపై హామీలు ఇచ్చిన పార్టీ నాయకత్వం ఈ ఘటనలపై తీసుకున్న చర్యలు సరిపోవని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పోలవరం ఎమ్మెల్యే చిర్ర బాలరాజుపై భారీ స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌పై పరిశ్రమలపై ఒత్తిళ్లు, భూవివాదాల్లో జోక్యం ఆరోపణలు రావడం, కాకినాడ ప్రాంతంలో పార్టీ నేతలపై బలవంతపు వసూళ్లు, దౌర్జన్య చర్యల ఆరోపణలు కలిపి పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని కూటమి సభ్యులే అంటున్నారు.
ఇంకా కొన్ని ప్రాంతాల్లో పార్టీ ఇన్‌చార్జ్ లు మహిళలపై దాడులు, హత్య కేసులు, భూకబ్జా ఆరోపణలు రావడం పరిస్థితిని మరింత దిగజార్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో జనసేన పార్టీ ఒక రాజకీయ వేదికగా కాకుండా, వివాదాల కేంద్రంగా మారుతోందనే అభిప్రాయం బలపడుతోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ రాజకీయ పార్టీ కన్నా ఆరాచక వ్యవస్థకి కేంద్ర భిందువుగా మారిందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.






