---Advertisement---

Rakta Charitra: ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్..పార్ట్ 3పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఆర్జీవీ!

July 11, 2026

Summarize with AI

---Advertisement---

రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో సంచలనం సృష్టించిన ‘రక్త చరిత్ర’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. 2010లో విడుదలై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ చిత్రం దాదాపు 16 ఏళ్ల తర్వాత జులై 17న రీ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ‘రక్త చరిత్ర పార్ట్ 3’పై ఆయన ఇచ్చిన క్లారిటీ అందరి దృష్టిని ఆకర్షించింది.

వివేక్ ఒబెరాయ్, సూర్య, రాధికా ఆప్టే, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని త్రిపుర క్రియేషన్స్ అధినేత మురళీకృష్ణ వంకాయలపాటి, నట్టీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, క్విటీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా రీ రిలీజ్ చేస్తున్నారు. ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆర్జీవీ, రాయలసీమలో జరిగిన వాస్తవ సంఘటనలను లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలిపారు. తన కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన చిత్రాల్లో ‘రక్త చరిత్ర’ ఒకటని పేర్కొంటూ, ప్రతీకారం, హింస చివరికి ఎంతటి వినాశనానికి దారి తీస్తాయో చూపించడమే ఈ సినిమా అసలు ఉద్దేశమని చెప్పారు.

‘రక్త చరిత్ర పార్ట్ 3 వచ్చే అవకాశముందా?’ అనే ప్రశ్నకు ఆర్జీవీ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. రెండో భాగంతో ప్రధాన పాత్రల కథ పూర్తిగా ముగిసిపోయిందని, అందుకే మూడో భాగానికి ఎలాంటి అవకాశం లేదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆ కథను కొనసాగించే పరిస్థితులు కూడా లేవని వ్యాఖ్యానించారు. రాయలసీమలో ఫ్యాక్షనిజం తగ్గిపోయిన ఈ సమయంలో సినిమాను మళ్లీ విడుదల చేయడం పాత ఉద్రిక్తతలను రెచ్చగొడుతుందా అనే ప్రశ్నకు స్పందిస్తూ, ఇప్పుడు సోషల్ మీడియాలో మాటల యుద్ధం చేసే వాళ్లు ఎక్కువగా ఉన్నారని, ఒకప్పుడు మాదిరిగా బహిరంగంగా తలపడే పరిస్థితి లేదని, ఇప్పుడున్న వాళ్లకు అంత సీన్ లేదంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

సినీ పరిశ్రమలో దర్శకుల కంటే స్టార్ హీరోల ఆధిపత్యం పెరిగిందనే అంశంపైనా వర్మ స్పందించారు. ప్రేక్షకులు ప్రధానంగా స్టార్ హీరోల కోసమే థియేటర్లకు వస్తారని, కోట్ల రూపాయల వ్యాపారం కూడా వారి మార్కెట్‌పైనే ఆధారపడుతుందని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో స్టార్ డామినేషన్ సహజమేనని, అందులో తప్పేమీ లేదని అన్నారు. దర్శకుడి అసలు ప్రతిభ స్టార్ హీరోను కథతో ఒప్పించగలిగే సామర్థ్యంలోనే కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు.

తన సినీ ప్రయాణంపై కూడా ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పటికీ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు తీయనని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులు కలిసి సినిమా చూసేటప్పుడు ఒక్కో వ్యక్తి ఒక్కో అంశంపై దృష్టి పెడతారని, అలాంటి కథలు తనను ఆకట్టుకోవని చెప్పారు. అలాగే పౌరాణిక చిత్రాలపై కూడా తనకు ఆసక్తి లేదని వెల్లడించారు. భారీ సెట్లు, ఖరీదైన కాస్ట్యూమ్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఆధారంగా తెరకెక్కే సినిమాల కంటే వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందే రియలిస్టిక్ డ్రామాలనే ఎక్కువగా ఇష్టపడతానన్నారు. ప్రస్తుతం హిందీలో పోలీస్ వ్యవస్థ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కిస్తున్నానని, అందుకే ఎక్కువ సమయం ముంబైలోనే గడుపుతున్నట్లు తెలిపారు.

నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ, ఒకప్పుడు రాయలసీమలో జరిగిన రక్తపాత రాజకీయాలను అత్యంత వాస్తవికంగా తెరపై చూపించిన చిత్రం ‘రక్త చరిత్ర’ అని అన్నారు. కొత్త తరం ప్రేక్షకులు కూడా ఈ చిత్రాన్ని పెద్ద తెరపై అనుభవించాలని భావించి రీ రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని వెల్లడించారు. జులై 12 శనివారం సాయంత్రం 4 గంటల నుంచి టికెట్ బుకింగ్ ప్రారంభమవుతుందని నిర్మాతలు నట్టి కుమార్, మురళీకృష్ణ వంకాయలపాటి తెలిపారు. ఒకప్పుడు సంచలనం సృష్టించిన ‘రక్త చరిత్ర’ జులై 17 రీ రిలీజ్‌తో మరోసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి స్పందన అందుకుంటుందో ఆసక్తిగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment