లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు అనూహ్యంగా వీగిపోవడం దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. మహిళా రిజర్వేషన్ చట్టం సవరణ బిల్లుకు కూడా ఇదే ప్రభావం పడింది. మొత్తం 528 ఓట్లు పోలవగా, అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు నమోదవడంతో బిల్లు ఆమోదం పొందలేదు. ఈ పరిణామంతో డీలిమిటేషన్ బిల్లు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా 50 శాతం సీట్ల పెంపును పరిశీలించేందుకు సిద్ధమని ప్రకటించినప్పటికీ, విపక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో బిల్లు ఆమోదం దిశగా సాగలేదు. ముఖ్యంగా డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే ఆందోళనలు తీవ్రంగా వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లు పై కొన్ని సూచనలు చేస్తూ ప్రతిపక్ష నేత జగన్ గతంలోనే ప్రధాని మోదీకి రాసిన లేఖపై రాజకీయ వర్గాలో చర్చ మోదలైంది . డీలిమిటేషన్ ప్రక్రియలో ఏ రాష్ట్రానికీ లోక్సభ లేదా రాజ్యసభలో ప్రాతినిధ్యం తగ్గకూడదని ఆయన నాడు ఆ లేఖలో స్పష్టం చేశారు. జనాభా ఆధారంగా మాత్రమే సీట్ల కేటాయింపు చేయడం వల్ల దక్షిణ రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని హెచ్చరించారు.
2026 జనగణన తర్వాత డీలిమిటేషన్ జరిగితే 1971 తర్వాత వచ్చిన జనాభా మార్పుల వల్ల అసమానతలు పెరిగే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కుటుంబ నియంత్రణలో విజయవంతమైన దక్షిణ రాష్ట్రాలు సీట్ల వాటాలో నష్టపోయే అవకాశముందని పేర్కొన్నారు. అందువల్ల అన్ని రాష్ట్రాలకు సమాన న్యాయం జరిగేలా రాజ్యాంగ సవరణలు చేయాలని సూచించారు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81(2)(అ) ప్రకారం రాష్ట్రాల జనాభా మరియు సీట్ల నిష్పత్తి సమానంగా ఉండాలన్న నిబంధన ప్రస్తుత పరిస్థితుల్లో సమస్యలకు దారి తీస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. డీలిమిటేషన్ వల్ల ఏ రాష్ట్రం కూడా తమ ప్రాతినిధ్యంలో తగ్గుదల ఎదుర్కోకుండా కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. ఈ అంశం దేశంలోని సామాజిక, రాజకీయ సమతుల్యతను ప్రభావితం చేసే అవకాశముందని హెచ్చరిస్తూ, రాష్ట్రాల మధ్య భిన్నతలను పరిగణనలోకి తీసుకుని సమగ్ర విధానం అవలంబించాలని సూచించారు.






