---Advertisement---

డిలిమిటేషన్ చరిత్ర – దక్షిణ భారత దేశానికి పోంచి ఉన్న ప్రమాదం ? కీలకంగా మారిన జగన్ సూచన.

April 18, 2026

---Advertisement---

భారతదేశ (India) రాజకీయ వ్యవస్థలో నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) (Delimitation) ఒక సాంకేతిక ప్రక్రియ మాత్రమే కాదు—ఇది దేశంలోని రాష్ట్రాల సమతుల్యతను నిర్ణయించే కీలక అంశం. ముఖ్యంగా 2026 తర్వాత జరిగే డిలిమిటేషన్ ప్రక్రియ, ఉత్తర (North) మరియు దక్షిణ (South) రాష్ట్రాల మధ్య ప్రాతినిధ్య సమీకరణాన్ని పూర్తిగా మార్చే సామర్థ్యం కలిగి ఉందనేది నిర్వివాదాంశం.

నిజానికి భారతదేశంలో ఇప్పటివరకు నాలుగు సార్లు డిలిమిటేషన్ కమిషన్లు (Delimitation Commissions) ఏర్పాటు చేయబడ్డాయి—1952 (1951 జనాభా), 1963 (1961 జనాభా), 1973 (1971 జనాభా), మరియు 2002 (2001 జనాభా). మొదటి మూడు దశల్లో జనాభా పెరుగుదల ఆధారంగా లోక్‌సభ సీట్ల (Lok Sabha Seats) సంఖ్యను 489 నుండి 543 వరకు పెంచారు. అయితే 2002లో మాత్రం సీట్ల సంఖ్యను మార్చకుండా, కేవలం నియోజకవర్గాల సరిహద్దులను మాత్రమే పునర్వ్యవస్థీకరించారు.

1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రభుత్వం (Indira Gandhi Government) డిలిమిటేషన్‌ను 2001 వరకు నిలిపివేశారు. దీనికి ప్రధాన కారణం కుటుంబ నియంత్రణలో ముందున్న రాష్ట్రాలు తమ జనాభా తగ్గుదల వల్ల ప్రాతినిధ్యం కోల్పోకుండా రక్షించడం. అదే విధంగా, 2001లో 84వ రాజ్యాంగ సవరణ (84th Constitutional Amendment) ద్వారా ఈ స్తంభనను (ఫ్రీజ్) 2026 వరకు పొడిగించారు.

కానీ ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1971లో దేశ జనాభాలో దక్షిణ రాష్ట్రాల వాటా 24.80% ఉండగా, 2011 నాటికి అది 20.88%కి పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ధోరణి కొనసాగితే, 2026 లేదా 2031 జనాభా లెక్కల నాటికి ఈ శాతం ఇంకా తగ్గే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. దీంతో జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలు శిక్ష అనుభవించే పరిస్థితి ఏర్పడింది.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 81(2)(ఏ) ప్రకారం, లోక్‌సభ సీట్ల కేటాయింపు జనాభా నిష్పత్తి ఆధారంగా జరగాలి. అంటే జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు రావడం సహజం. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ దీని వలన ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు మరింత రాజకీయ ప్రభావాన్ని సంపాదిస్తే, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల ప్రభావం కుటుంబ నియంత్రణ పాటించడం వలన తగ్గిపోతుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య తగ్గుదల మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వాల రూపకల్పనలో దక్షిణ భారత దేశం నిర్ణయాత్మక శక్తి కోల్పోవడం కూడా. భవిష్యత్తులో విధానాల రూపకల్పనలో దక్షిణ రాష్ట్రాల స్వరం బలహీనపడే ప్రమాదం ఉంది.

అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2011 జనాభా లెక్కల ఆధారంగా డిలిమిటేషన్ చేపట్టడం దక్షిణ రాష్ట్రాలకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఉత్తర–దక్షిణ మధ్య జనాభా అంతరం తరువాతి సంవత్సరాల్లో మరింత పెరిగింది. అలాగే లోక్‌సభ సీట్ల సంఖ్యను గణనీయంగా 550 నుంచి 850 వరకు పెంచితే, రాష్ట్రాల వాటా తగ్గకుండా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు, ఒక రాష్ట్రం తన శాతం తగ్గినా, మొత్తం సీట్లు పెరగడం వల్ల ఆ రాష్ట్రానికి ఉన్న సీట్ల సంఖ్య తగ్గకపోవచ్చు.

ఈ సమయంలో ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) గారు ప్రతిపాదించిన పరిష్కారం ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆయన గతంలో ప్రధానమంత్రికి రాసిన లేఖలో, కుటుంబ నియంత్రణను జాతీయ బాధ్యతగా భావించి అమలు చేసిన రాష్ట్రాలను శిక్షించడం అన్యాయమని స్పష్టం చేశారు. ఆయన కేవలం సమస్యను ప్రస్తావించడమే కాకుండా, ఒక నిర్మాణాత్మక పరిష్కారాన్ని కూడా సూచించారు. ఏ రాష్ట్రం కూడా తన ప్రస్తుత ప్రాతినిధ్య శాతాన్ని కోల్పోకుండా ఉండేలా రాజ్యాంగ సవరణ చేయాలని. ఇది సమాఖ్య స్ఫూర్తిని కాపాడే ఒక సమతుల్య దృక్కోణంగా భావించబడుతోంది. అలాగే సీట్ల సంఖ్యను 816 లేదా అంతకంటే ఎక్కువగా పెంచే మోడల్ ద్వారా, దక్షిణ రాష్ట్రాల వాటాను సుమారు 24% వద్ద నిలుపుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది రాజకీయ లాభనష్టాల కంటే దేశ సమతుల్యతను ముందుకు ఉంచే దృక్కోణంగా స్పష్టంగా కనిపిస్తుంది.

ఇంకా ఒక ముఖ్య అంశం ఎంటంటే 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కోవిడ్-19 కారణంగా వాయిదా పడ్డాయి. అవి 2026 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. దీని వెంటనే డిలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ ప్రారంభమైతే దక్షిణ భారతం 20.88% కన్నా తక్కువ జనాభా కలిగి ఉండడంతో ఇంకా సీట్లు తగ్గే అవకాశం ఉందా? అనేది ఒక మౌళిక ప్రశ్న.

దీంతో “ఇప్పుడు కొంత నష్టం అంగీకరించడం మంచిదా? లేక భవిష్యత్తులో మరింత పెద్ద నష్టాన్ని ఎదుర్కోవాలా?” అనే ప్రశ్న దక్షిణ భారత దేశ ప్రజల ముందుంది. ప్రస్తుత పరిణామాలను పరిశీలిస్తే, 2011 లెక్కల ఆధారంగా తక్షణ డిలిమిటేషన్ చేపట్టడం, సీట్ల సంఖ్య పెంపు, మరియు రాజ్యాంగ పరిరక్షణ కల్పించడం—ఈ మూడు కలిసి మాత్రమే దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని కాపాడగలవు అనేది కాదనలేని సత్యం. లేకపోతే 2026 తరువాత మరింత నష్టం జరిగే ప్రమాదం ఉంది.

డిలిమిటేషన్ ఒక పరిపాలనా చర్య మాత్రమే కాదు. ఇది భారత సమాఖ్య నిర్మాణానికి సంబంధించిన అత్యంత సున్నితమైన అంశం. సమతుల్యత లేకపోతే, ప్రాంతీయ అసమానతలు మరింత తీవ్రమవుతాయి. అందుకే సమయోచిత నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు అత్యవసరం అని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు. జగన్ గారు ప్రధానికి రాసిన లేఖలో చూపిన పరిష్కారమే ప్రస్తుతం దక్షిణ దేశానికి రక్ష అని రాజకీయ నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment