తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఈ రోజు సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లకు తమ సందేశాలను చేరవేస్తున్నాయి. ఇదే సమయంలో టీవీకే పార్టీ అధినేత విజయ్ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాసి కీలక వ్యాఖ్యలు చేశారు.
తనను ఎవరూ లొంగదీసుకోలేరన్న విజయ్
రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి తనపై అనేక ఒత్తిళ్లు, అవరోధాలు వస్తున్నాయని విజయ్ పేర్కొన్నారు. అయినప్పటికీ తనను ఎవరూ లొంగదీసుకోలేరని, ప్రజల సంక్షేమమే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల కోసం ప్రారంభించిన ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరని తెలిపారు.
ప్రత్యర్థి పార్టీలపై కూడా విజయ్ విమర్శలు గుప్పించారు. తమిళనాడుకు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులు తనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. బెదిరింపులు, ఒత్తిళ్లకు తాను భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అధికారాన్ని ఉపయోగించి భయపెట్టాలని చూసే వారికి ప్రజలే సరైన సమాధానం చెబుతారని అన్నారు.
టీవీకే కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, అది సామాజిక న్యాయాన్ని కాపాడే కోట అని విజయ్ పేర్కొన్నారు. టీవీకే ప్రజల గుండెల్లో వెలిగే ఆశాకిరణమని చెప్పారు. అవినీతి, విభజన రాజకీయాలు తమ పార్టీని ఓడించలేవని ధీమా వ్యక్తం చేశారు.
రాబోయే తరాల భవిష్యత్తు కోసం ప్రజలంతా ఒక్కటిగా నిలవాలని విజయ్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో కుటుంబ సమేతంగా వెళ్లి విజిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. డబ్బు రాజకీయాలకు లొంగకుండా మార్పు కోసం ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.






