---Advertisement---

అన్నా క్యాంటిన్లు: నిర్మాణం నుండి నాణ్యత వరకు అనేక ఆరోపణలు?

April 24, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమని చెబుతున్న అన్నా క్యాంటిన్ల పథకం ప్రస్తుతం అనేక వివాదాలకు, అవకతవకల ఆరోపణలకు కేంద్రబిందువుగా మారింది. పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో ప్రారంభించామని చెబుతున్న ఈ పథకంలో, నిర్మాణ ఖర్చుల నుండి భోజన నాణ్యత వరకు అనేక లోపాలు ఉన్నట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా అన్నా క్యాంటిన్ల నిర్మాణ వ్యయంపై తీవ్రమైన ఆర్థిక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో క్యాంటిన్ నిర్మాణానికి ప్రభుత్వం సుమారు 35 లక్షల నుండి 50 లక్షల రూపాయలు ఖర్చు చేస్తోందని, కానీ వాస్తవానికి ఇవి కేవలం 5 లక్షల రూపాయలతోనే నిర్మించవచ్చని పలువురు నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ భారీ వ్యత్యాసం ద్వారా కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరుస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఇటీవల ప్రభుత్వం 183 క్యాంటిన్ల మరమ్మతుల కోసం 15 కోట్ల రూపాయలు, 18 క్యాంటిన్ల పూర్తి కోసం 4.20 కోట్ల రూపాయలు, మరియు కొత్తగా 2 క్యాంటిన్ల నిర్మాణం కోసం 1 కోటి రూపాయలను మంజూరు చేసింది. కేవలం కుప్పం మరియు హైకోర్టు క్యాంటిన్ల నిర్వహణ కోసం 98.20 లక్షల రూపాయల పరిపాలనా అనుమతులు ఇచ్చారు. ఇది వాస్తవ ఖర్చు కన్నా అధికంగా ఉందనే అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది.

మరోపక్క చూస్తే, చాలీచాలని భోజనం మరియు అదనపు వసూళ్లపై కూడా ఆరోపణలు ఉన్నాయి. పథకం అమలులో క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని పలువురు చెబుతున్నారు. క్యాంటిన్లలో పెడుతున్న భోజనం పేదలకు సరిపోవడం లేదని, చాలా చోట్ల ‘అరాకొరా’ భోజనమే లభిస్తోందని వార్తలు వస్తున్నాయి. అలాగే నిర్ణీత మెనూ ప్రకారం కాకుండా తక్కువ పదార్థాలు పెడుతున్నారని, ఎవరైనా అదనంగా అన్నం కావాలని అడిగితే వారి నుంచి మరో 5 రూపాయలు వసూలు చేస్తున్నట్లు పలు చోట్ల గుర్తించారు. ఇది పేద ప్రజలపై అదనపు భారం మోపడమే అవుతుందని పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రభుత్వం నిర్ణయించిన మెనూలో ఐదు రకాల పదార్థాలు ఉండాలి, కానీ కొన్ని చోట్ల కేవలం రెండు రకాలే వడ్డిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నాణ్యత లోపం మరియు సరఫరాలో జాప్యం కూడా ప్రధాన సమస్యలుగా మారాయి. అనేక ప్రాంతాల్లో రాత్రి 8:30 గంటలైనా భోజనం అందక ప్రజలు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. అంతేకాకుండా వారంలో రెండు రోజుల పాటు వివిధ కారణాలతో భోజన సరఫరా నిలిపివేయడం, అపరిశుభ్రత వంటి అంశాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

సాంకేతికత పేరుతో భారీ ఖర్చులు కూడా ప్రశ్నార్థకంగా మారాయి. క్యాంటిన్లలో పర్యవేక్షణ కోసం సాఫ్ట్‌వేర్ పరికరాల సరఫరాకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 203 అన్నా క్యాంటిన్లలో ఐఓటీ (IoT) పరికరాల సరఫరాడిం మరియు సాఫ్ట్‌వేర్ నిర్వహణ కోసం మూడు సంవత్సరాల కాలానికి 7,48,65,265 రూపాయల కాంట్రాక్టును అక్షరా ఎంటర్‌ప్రైజెస్ అనే ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. ఈ సంస్థకు ఉన్న అర్హతపై కూడా ప్రభుత్వం స్పష్టమైన ఆధారాలు ప్రజలకు వెల్లచలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో క్యాంటిన్‌కు సుమారు 3.69 లక్షల రూపాయలు ఈ సాంకేతికత కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సాంకేతికత పేదల ఆకలి తీర్చడంలో ఎంతవరకు ఉపయోగపడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

అన్నా క్యాంటిన్లకు ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ రంగులు (పసుపు) వేయడంపై హైకోర్టు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిధులతో పార్టీ ప్రచారం చేసుకోవడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు కనిపించడంలేదని విమర్శలు ఉన్నాయి.

మొత్తంగా చూస్తే, అన్నా క్యాంటిన్ల పథకం లక్ష్యం పేదల ఆకలి తీర్చడమేనని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అమలులో జరుగుతున్న అవకతవకలు, అధిక నిర్మాణ వ్యయాలు, మరియు నాణ్యత లోపాల కారణంగా ప్రజలకు పూర్తిస్థాయిలో మేలు జరగడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా వేల సంఖ్యలో గ్రామాలు ఉన్న రాష్ట్రంలో కేవలం 203 క్యాంటిన్లు నడుపుతూ అందులోను ఒక్కో చోట 350 మందికి మించి ప్రజలకి భోజనం పెట్టే సౌకర్యం కల్పించకుండా మొత్తం రాష్ట్రానికి లబ్ధి చేకూర్చామని చెప్పడంపై కూడా ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment