టాలీవుడ్ సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి (JD Chakravarthy) చేసిన తాజా వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన శివ సినిమా గురించి మాట్లాడుతూ ఆయన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమాలో నాగార్జున (Nagarjuna) హీరోగా నటించగా, రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకుడిగా పరిచయం అయ్యారు.
ప్రస్తుతం జేడీ చక్రవర్తి గాయపడ్డ సింహం సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శివ సినిమా (Shiva Movie) షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు.
షూటింగ్ మొదటి రోజే ఉద్రిక్తత
జేడీ చక్రవర్తి మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ చాలా ముక్కుసూటి వ్యక్తి అని, ఎవరి అభిప్రాయాలనూ పెద్దగా పట్టించుకునే వ్యక్తి కాదని తెలిపారు. శివ ఆయనకు తొలి సినిమా అయినప్పటికీ, ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా తెరకెక్కించారని చెప్పారు.
షూటింగ్ మొదటి రోజున ఒక యాక్షన్ సన్నివేశం చిత్రీకరణకు సిద్ధమయ్యారని తెలిపారు. ఆ సన్నివేశానికి ప్రముఖ యాక్షన్ మాస్టర్ రాజు మాస్టర్ పనిచేశారని చెప్పారు. టైర్లు కాల్చడం, పొగ ఎఫెక్ట్స్ వంటి ఏర్పాట్లు చేసిన తర్వాత వర్మ వాటిని చూసి ఇవేమీ అవసరం లేదని, తనకు ఇలాంటి ఎఫెక్ట్స్ వద్దని గట్టిగా చెప్పారన్నారు.
దీంతో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందని జేడీ తెలిపారు. అయితే హీరో నాగార్జున మాత్రం వర్మను పూర్తిగా నమ్మి ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని చెప్పారు.
నాగార్జున నమ్మకమే ఆర్జీవీకి బలం
ఆ రోజున నాగార్జున చూపిన నమ్మకమే శివ సినిమా విజయానికి కారణమైందని జేడీ పేర్కొన్నారు. అదే నమ్మకం లేకపోయి ఉంటే రామ్ గోపాల్ వర్మ కెరీర్ మొదటి రోజే ముగిసిపోయేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.






