ప్రఖ్యాత భారత బ్యాడ్మింటన్ స్టార్ (Indian Badminton Star), ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు (PV Sindhu) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. క్రీడాకారిణిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు పరిపాలనా రంగంలోనూ కీలక బాధ్యత చేపట్టి భారత కీర్తిని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (BWF) అథ్లెట్స్ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా (Athletes Commission Chairperson) ఎన్నికైన సింధు, ఇప్పుడు BWF కౌన్సిల్‌లో పూర్తిస్థాయి ఓటింగ్ సభ్యురాలిగా అధికారికంగా తన బాధ్యతలు ప్రారంభించారు.
2025 చివర్లో అవసరమైన ప్రక్రియలను పూర్తి చేసుకున్న సింధు, తాజాగా డెన్మార్క్‌లోని హార్సెన్స్ నగరంలో నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో తొలిసారి కౌన్సిల్ సభ్యురాలిగా హాజరయ్యారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అత్యున్నత నిర్ణయాధికార సంస్థలో చోటు సంపాదించడం ద్వారా సింధు మరో చరిత్ర సృష్టించినట్టైంది.
సింధు చేరికతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారుల సమస్యలకు మరింత ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో ప్రైజ్ మనీ పెంపు, అగ్రశ్రేణి ఆటగాళ్లపై టోర్నమెంట్ల ఒత్తిడి తగ్గించడం, వరుస పోటీల వల్ల గాయాల సమస్యలను తగ్గించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చురుగ్గా ఆడుతున్న క్రీడాకారిణిగానే కాకుండా, గ్లోబల్ గవర్నెన్స్‌లో (Global Governance) ఓటింగ్ హక్కు పొందడం నిజంగా విశేషమే.
ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాడ్మింటన్ ఆటగాళ్ల తరఫున తమ గొంతుకను వినిపించే అవకాశం రావడం తనకు గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. క్రీడల అభివృద్ధికి తాను శక్తివంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు.
BWF అధ్యక్షురాలు ఖున్యింగ్ పటామా లీస్వద్త్రాకుల్ (Khunying Patama Leeswadtrakul) సింధును హృదయపూర్వకంగా స్వాగతించారు. సింధు వంటి గొప్ప రోల్ మోడల్ కౌన్సిల్‌లో ఉండటం వల్ల అథ్లెట్ల అభిప్రాయాలు మరింత బలంగా వినిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆమె అనుభవం బ్యాడ్మింటన్ భవిష్యత్తును మరింత మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందని బోర్డు సభ్యులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.






