తెలంగాణ (Telangana) రాష్ట్రానికి కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP)గా సి.వి. ఆనంద్‌ను (C.V. Anand) ప్రభుత్వం అధికారికంగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సి.వి. ఆనంద్, 1991 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీనియర్ అధికారి. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి (Shivdhar Reddy) మరో 2 రోజుల్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
పోలీస్ శాఖలో విశేష అనుభవం, పరిపాలనా నైపుణ్యం కలిగిన అధికారిగా సి.వి. ఆనంద్‌కు మంచి గుర్తింపు ఉంది. కఠిన నిర్ణయాలు తీసుకునే అధికారిగా పేరున్న ఆయన, శాంతి భద్రతల పరిరక్షణలో తనదైన ముద్ర వేశారు. ప్రజా సమస్యలపై వేగంగా స్పందించే అధికారిగా కూడా గుర్తింపు పొందారు.
సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ముందుండే సి.వి. ఆనంద్, హైదరాబాద్ ట్రాఫిక్ విభాగంలో ఈ-చలాన్ (e-Challan) వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేశారు. ఈ విధానం ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలపై పారదర్శక చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలకు సులభ సేవలు అందేలా మార్పులు తీసుకొచ్చారు.
మహిళల భద్రత కోసం షీ టీమ్స్(SHE Teams), షీ షటిల్(SHE Shuttle) వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చిన ఆయన, డ్రగ్స్ నియంత్రణ కోసం హెచ్-న్యూ (H-NEW) (Hyderabad Narcotics Enforcement Wing) ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. నగర భద్రత, మహిళా రక్షణ, మాదక ద్రవ్యాల నిర్మూలనలో ఆయన చర్యలు ప్రశంసలు అందుకున్నాయి.
తన సుదీర్ఘ సేవల కాలంలో అదనపు కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) హైదరాబాద్, కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్, కమిషనర్ సివిల్ సప్లైస్, సీఐఎస్ఎఫ్(CISF)లో IGగా కేంద్ర డిప్యూటేషన్, NISA డైరెక్టర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా 2021 నుంచి 2023 వరకు, అవినీతి నిరోధక బ్యూరో డీజీ, విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ డీజీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోం శాఖ వంటి అనేక కీలక పదవులు నిర్వహించారు.
అవినీతి నిరోధక చర్యల్లో కఠిన వైఖరి ప్రదర్శించిన సి.వి. ఆనంద్, ఎన్నికల నిర్వహణలో ఉత్తమ విధానాల అమలుకు ఎలక్షన్ కమిషన్ నుంచి జాతీయ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా స్వీకరించడం ఆయన కెరీర్లో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది.
పోలీస్ అధికారిగా మాత్రమే కాకుండా మాజీ క్రికెటర్‌గా కూడా సి.వి. ఆనంద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా 2 సార్లు పనిచేసిన ఆయన, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కూడా సేవలందించారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగానికి డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో పోలీస్ శాఖలో కొత్త దిశలో మార్పులు వస్తాయన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి.






