బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) పార్టీ మార్పుపై వస్తున్న ప్రచారాలకు చెక్ పెట్టేలా కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) సమావేశానికి హాజరైన నేపథ్యంలో మల్లారెడ్డి బీజేపీ (BJP)లో చేరబోతున్నారనే వార్తలు జోరుగా వినిపించాయి.
ఈ ప్రచారంపై స్పందించిన మల్లారెడ్డి.. ప్రధానిని కలిసినంత మాత్రాన పార్టీ మారినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారు. తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని మరోసారి క్లారిటీ ఇచ్చారు. నిరాధార ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు.
పార్టీ మార్పుపై మీడియా ప్రతినిధులు ప్రశ్నలు అడిగిన సమయంలో మల్లారెడ్డి కొంత ఆవేశంగా స్పందించారు. సోషల్ మీడియా ప్రచారాలకు ప్రతిసారి వివరణ ఇవ్వడం తన పని కాదని పేర్కొంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఆయన పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లైంది.
అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం ఈ అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మల్లారెడ్డి కుటుంబ సభ్యుల రాజకీయ కదలికలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మరోవైపు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి (Preethi Reddy) ఇటీవల ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఇటీవల ప్రీతిరెడ్డి బీజేపీ పార్టీ ఆఫీస్కు వెళ్లడం కూడా పెద్ద చర్చగా మారింది. అయితే అది మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ఆమె క్లారిటీ ఇచ్చారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో AI క్యాంపస్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించామని తెలిపారు.
మోడీని ఆహ్వానించిన కారణంగానే బీజేపీ నేతలను కలుస్తున్నామని, బీజేపీ మాత్రమే కాదు అన్ని పార్టీల నాయకులను కలిసి ఆహ్వానిస్తున్నామని ప్రీతిరెడ్డి స్పష్టం చేశారు. అయినప్పటికీ మల్లారెడ్డి కుటుంబం రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.






