తమిళనాట ఎన్నికల ఫలితాల్లో (Tamil Nadu Elections Results) టీవీకే పార్టీ(TVK Party) ఘన విజయం సాధించడంతో ఒక్కసారిగా దేశంలో దళపతి విజయ్ (Thalapathy Vijay) గ్రాఫ్ పతాకస్థాయికి చేరిందని చెప్పవచ్చు. ముఖ్యంగా విజయ్ ఈ ఎన్నికల్లో చూపిన పోరాట పటిమ, పార్టీ స్థాపించిన రోజు నుంచి దశాబ్దాలుగా తమిళనాడును శాసిస్తున్న డీఎంకే(DMK), అన్నా డీఎంకే (AIADMK) పార్టీలపై చేసిన పోరాటం — ఆ పోరాటం ద్వారా ప్రజల్లో అన్ని వర్గాల నమ్మకాన్ని సంపాదించడం ఒక రాజకీయ పాఠంగా అభివర్ణిస్తున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో విజయ్ పార్టీ ఘన విజయం (రాజకీయ పాఠం) ఎఫెక్ట్ జనసేనపై (Jana Sena Party) భారీగానే పడినట్టు కనిపిస్తుంది. విజయ్ గెలుపుతో తెలుగునాట టీవీకే పార్టీ రాజకీయ ప్రస్థానాన్ని, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జనసేన రాజకీయ ప్రస్థానాన్ని పోల్చుతూ విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అటు విజయ్, ఇటు పవన్ కళ్యాణ్ — ఇద్దరూ సినీరంగం నుండి వచ్చి స్వంతంగా రాజకీయ పార్టీలు స్థాపించిన వారే. అయితే తన రాజకీయ ప్రయాణంలో విజయ్ సాధించిన విజయాన్ని పవన్ కళ్యాణ్ సాధించలేకపోవడానికి కారణం ఆయనలో లోపించిన చిత్తశుద్ధే అని కొందరు చెబుతున్నారు.
మొదటి నుండి ఇరువురి రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే, విజయ్ సినిమా హీరోగానే ఉంటూ తన అభిమాన సంఘం ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ను 2009లో స్థాపించడం ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. ఇది సంవత్సరాల పాటు సామాజిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా సినిమా హీరోగా ఉంటూనే ‘కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్’ను 2007లో స్థాపించినా, అది ఒక వార్తగా మాత్రమే నిలిచింది కానీ ప్రజలకు ఏ విధమైన ప్రయోజనం కలిగిందో స్పష్టంగా తెలియదు. ఒక చిన్న స్వచ్చంద సంస్థను కూడా సమర్థంగా నడపలేకపోయారని ఈ పరిణామాల ద్వారా విమర్శలు వస్తున్నాయి.
ఇక పవన్ కళ్యాణ్ 2008లో అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో (Praja Rajyam Party) యువరాజ్యం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను తీవ్రంగా విమర్శించారు. అయితే 2014లో జనసేన పార్టీ స్థాపించిన తరువాత ఎన్నికల్లో పోటీ చేయకుండా, విమర్శించిన తెలుగుదేశం పార్టీకే మద్దతు ఇవ్వడం ఆయన రాజకీయ ప్రయాణంలో విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తింది. తన లక్ష్యం తన గెలుపు కాదని, జగన్ ఓటమి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆ సమయంలో జరిగిన పరిణామాలు సూచించాయి. ఒక వ్యక్తిని ఓడించడమే లక్ష్యంగా పార్టీ స్థాపించడం, ఒక సామాజిక వర్గాన్ని అదే వ్యక్తికి వ్యతిరేకంగా రెచ్చకొట్టే ప్రయత్నం చేయడం కూడా విమర్శలకు దారి తీసింది.
ఇక విజయ్ రాజకీయ ప్రయాణాన్ని చూస్తే, 2024 ఫిబ్రవరిలో పార్టీ స్థాపించిన రోజు నుంచే తాను ఒక నిబద్ధత గల నాయకుడిగా వ్యవహరించారు. తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీల ద్రావిడ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయంగా ‘మూడవ శక్తి’గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రయాణంలో కేసులు, ఆరోపణలు, కుటుంబ విషయాలు వంటి అనేక అంశాలపై విమర్శలు వచ్చినా ఎక్కడా వెనకడుగు వేయలేదు. ఎలాంటి పొత్తులు లేకుండా బలమైన పార్టీలను నేరుగా ఎదుర్కొనే ధైర్యం చూపించారు.
విజయ్‌లో ఉన్న ఈ తెగింపు, తనపై మరియు తన అభిమానులపై ఉన్న నమ్మకం పవన్ కళ్యాణ్‌లో కనిపించలేదని విమర్శకులు అంటున్నారు. జనసేన పార్టీ స్థాపించిన దశాబ్దం తరువాత కూడా తాను ఒంటరిగా పోటీ చేయలేనని, తన దగ్గర వనరులు లేవని చెప్పడం ద్వారా తన అసమర్థతను పరోక్షంగా ఒప్పుకున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే కొందరు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలను సమర్థించినా, తమిళనాట విజయ్ కేవలం రెండు సంవత్సరాల్లో పార్టీని బలోపేతం చేసి గెలుపు దిశగా తీసుకెళ్లడం చూసిన తరువాత, పవన్ కళ్యాణ్ వ్యూహాలపై మరిన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా పొత్తుల రాజకీయాలపై ఆయన తీసుకున్న నిర్ణయాలు కూడా చర్చనీయాంశంగా మారాయి.
ఇది ఇలా ఉంటే, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పొత్తులో పదవి సంపాదించినా, 15 ఏళ్ళు చంద్రబాబుగారే ముఖ్యమంత్రిగా ఉండాలని, పొత్తులో బాధలు ఉన్నా భరించి ముందుకు వెళ్లాల్సిందే అని క్యాడర్కు దిశానిర్దేశం చేయడం మరో ఆశ్చర్యకరమైన విషయంగా చెబుతున్నారు. ఎక్కడైనా పార్టీ అధ్యక్షుడు విజయ్ లాగా తాను సీఎం అవ్వాలని కోరుకుంటారు, కానీ జనసేన అధినేత మాత్రం తాను సీఎం అవ్వనని, తనకి అనుభవం లేదని, ఫైనాన్స్ తెలియదని, ప్రాజెక్టులపై అవగాహన లేదని లాంటి మాటలు చెప్పి తెలుగుదేశానికి బీటీం పార్టీగా మిగిలిపోవడాన్ని అభిమానులే జీర్ణించుకోలేని పరిస్థితికి వచ్చారు.
ఇక విజయ్ కు వ్యతిరేకంగా అక్కడ రాజకీయ పార్టీలు వారి మీడియా సంస్థల ద్వారా రోజుకొక వ్యతిరేక కథనం ప్రసారం చేసినా ఎన్నికల్లో తేల్చుకుంటానని దీమాగా నిలబడ్డారే కానీ, పవన్ కళ్యాణ్ మాదిరి మీడియాను అడ్డం పెట్టుకుని తన తల్లిని దూషించిన పార్టీతోనే పొత్తు ప్రయత్నం చేయలేదని, పవన్ కళ్యాణ్ ఇలా చేయడమే ఆయనలో ధైర్యంగా నిలబడి పోరాటం చేసే గుణం లేదని తేటతెల్లమయ్యేలా చేశాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇక భాష విషయంలో కూడా పవన్ కళ్యాణ్ తరచుగా ఆవేశపూరిత అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ప్రత్యర్ధులని రాజకీయ ప్రత్యర్ధులుగా కాకుండా వర్గ శత్రువులుగా చూడటం విమర్శలకు దారి తీస్తోంది. అదే సమయంలో విజయ్ ప్రత్యర్థులను రాజకీయ ప్రత్యర్థులుగానే చూసి, మర్యాదపూర్వక భాషతో విమర్శలు చేయడం ద్వారా ప్రజలకు దగ్గరయ్యారని చెప్పబడుతోంది.
ఈ నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చెప్పిన — “మనకు బలం లేదు”, “ఒంటరిగా పోటీ చేయలేము”, “పొత్తులు అవసరం” వంటి వ్యాఖ్యలను విజయ్ గెలుపు తర్వాత కూడా ప్రజలు నమ్ముతారా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మొత్తానికి తమిళనాట విజయ్ విజయం, పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తుకు ఒక అగ్నిపరీక్షగా మారిందని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఆయన ప్రతి నిర్ణయం విజయ్‌తో పోల్చబడే అవకాశం ఉంది. ఇది ఆయనకు పెద్ద రాజకీయ సవాల్‌గా మారింది.






