కరీంనగర్ (Karimnagar) నగరంలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ(BJP) శ్రేణులు గంగుల కమలాకర్ (Gangula Kamalakar) క్యాంప్ కార్యాలయంపై మెరుపుదాడికి దిగడం తీవ్ర కలకలం రేపింది. రాడ్లు, కర్రలతో వచ్చిన కొందరు కార్యకర్తలు కార్యాలయంపై దాడి చేసి, అక్కడ ఉన్న కార్ల అద్దాలను ధ్వంసం చేయడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.
లా అండ్ ఆర్డర్ (Law and Order) పూర్తిగా విఫలమైందంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ముందుగానే రెక్కీ నిర్వహిస్తున్నారని చెప్పానని, కొద్దిసేపటికే దొంగల్లా వచ్చి దాడి చేశారని ఆరోపించారు. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఈ ఘటన ఇంటెలిజెన్స్ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించిన కౌశిక్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరియు కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై (Bandi Sanjay) తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కరీంనగర్ సంస్కృతి గన్ కల్చర్, కర్రల దాడులు కాదని పేర్కొంటూ, తనపైకి రౌడీ షీటర్లను పంపించారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
దాడి ఘటన తర్వాత కరీంనగర్‌లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో క్యాంప్ కార్యాలయానికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేపై దాడిని బీఆర్‌ఎస్(BRS) అధిష్టానం తీవ్రంగా ఖండించగా, నగరంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన నెలకొంది.






