టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, వైఎస్సార్‌సీపీ నేత మాజీ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డి మధ్య వివాదం మరింత ముదురుతోంది. తనపై అసత్య ఆరోపణలు మోపాలనే ఉద్దేశంతో బీఆర్ నాయుడు అడ్డదారులు తొక్కుతున్నారని భూమన తీవ్రస్థాయిలో ఆరోపించారు. తన వద్ద పనిచేసిన మాజీ డ్రైవర్‌ను ప్రలోభపెట్టి, బెదిరించి తనకు వ్యతిరేకంగా టీవీ5లో మాట్లాడించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఈ చర్యలను అత్యంత నీతిమాలినవిగా, సిగ్గుచేటుగా అభివర్ణించారు.
భూమన అనుచరుల ఆరోపణల ప్రకారం.. టీటీడీ ఛైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడు అనైతిక, అసమర్థ చర్యలను భూమన ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకువస్తుండటమే ఈ రాజకీయ టార్గెటింగ్‌కు కారణమని చెబుతున్నారు. బీఆర్ నాయుడికి సంబంధించిన ప్రైవేట్ వీడియోలు వెలుగులోకి వచ్చిన సందర్భంలో, పవిత్రమైన టీటీడీ ఛైర్మన్ పదవిలో ఉండి ఇలాంటి వ్యవహారాలు సరికాదని భూమన బహిరంగంగా ప్రశ్నించారు. వెంటనే పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ నాయుడిపై నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.
ఇదే కాకుండా, గతంలో శ్రీవాణి ట్రస్ట్ వ్యవహారం, తొక్కిసలాట ఘటనలు, గోవుల మరణాల వంటి అంశాలపై కూడా భూమన తీవ్రంగా స్పందిస్తూ టీటీడీ వ్యవహారాలను ప్రశ్నించారు. దీంతో బీఆర్ నాయుడు భూమనను రాజకీయంగా టార్గెట్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
భగవద్గీత పుస్తకాల ప్రచురణ అంశంపై కూడా భూమనపై బీఆర్ నాయుడు తీవ్ర ఆరోపణలు చేయగా, టీవీ5లో భారీగా ప్రచారం నిర్వహించారు. అయితే ఆ ఆరోపణలకు భూమన ప్రెస్‌మీట్ ద్వారా గట్టి కౌంటర్ ఇవ్వడంతో బీఆర్ నాయుడు విమర్శల్లో తేలిపోయారని వైఎస్సార్‌సీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ నేపథ్యంలో ఎలాగైనా భూమనపై నిందలు మోపాలని ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గురువారం మీడియాతో మాట్లాడిన భూమన.. “ప్రపంచ ప్రసిద్ధ ధార్మిక సంస్థ అయిన టీటీడీకి చైర్మన్‌గా వినయంతో, శీలంతో ఉండాల్సిన వ్యక్తి ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటు” అని మండిపడ్డారు.
తాను జీవితాంతం ఉద్యమాలు, పోరాటాలతో ఎదిగిన వ్యక్తినని, పైరవీలతో పదవులు పొందిన వాడిని కాదని భూమన వ్యాఖ్యానించారు. “నన్ను భయపెట్టలేరు, బెదిరించలేరు. బీఆర్ నాయుడు చేస్తున్న అనైతిక, అరాచక చర్యలను ప్రజల ముందు ఎప్పటికప్పుడు బయటపెడతాం” అని స్పష్టం చేశారు. టీటీడీ వంటి పవిత్ర సంస్థ ప్రతిష్ట దెబ్బతినకుండా ఉండాలంటే ఇలాంటి వ్యవహారాలపై సమగ్ర విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.






