తమిళనాడు రాజకీయాల్లో (Tamil Nadu Politics) ముఖ్యమంత్రుల వ్యవహార శైలి ఎప్పుడూ హాట్‌టాపిక్‌గా ఉంటుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థులపై రాజకీయ ప్రతీకారాలు తీర్చుకోవడం అక్కడ సాధారణంగా కనిపించే అంశం. అయితే తాజాగా సీఎం విజయ్ (CM Vijay) తీసుకున్న నిర్ణయం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
స్టాలిన్‌ను కలిసిన విజయ్
తాజా ఎన్నికల్లో పరాజయం పాలైన మాజీ సీఎం స్టాలిన్ (Stalin) నివాసానికి స్వయంగా సీఎం విజయ్ వెళ్లి పరామర్శించారు. విజయ్ ఇంటికి చేరుకోగానే స్టాలిన్ శాలువాతో సత్కరించగా, ఉదయనిధి స్టాలిన్ ఘనస్వాగతం పలికారు. అనంతరం ఇద్దరూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.
స్టాలిన్ పాలన అనుభవాలపై పలు సూచనలు, సలహాలు కోరినట్లు సమాచారం. సాధారణంగా ఓడిపోయిన ప్రత్యర్థి నేత ఇంటికి అధికారంలోకి వచ్చిన సీఎం వెళ్లడం అరుదు. కానీ విజయ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
స్టాలిన్‌ను కలిసిన తర్వాత ఎండీఎంకే (MDMK) నేత వైకోను కూడా విజయ్ పరామర్శించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. విపక్ష నేతలతో వరుస భేటీలు జరపడం ద్వారా సమన్వయ రాజకీయాలకు విజయ్ ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మే 4న విడుదలైన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. విజయ్ నేతృత్వంలోని టీవీకే(TVK) 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచినా మ్యాజిక్ ఫిగర్‌కు 10 సీట్లు తక్కువయ్యాయి. దీంతో రాష్ట్రంలో 5 రోజుల పాటు రాజకీయ అనిశ్చితి నెలకొంది.
కాంగ్రెస్, వీసీకే, ముస్లిం లీగ్, వామపక్షాల మద్దతుతో విజయ్ బలం 120కి చేరడంతో గవర్నర్ అర్లేకర్ ప్రభుత్వం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనంతరం విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం కూడా పూర్తైంది.






