---Advertisement---

ఉద్యోగుల ఆగ్రహం.. సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నం!

May 15, 2026

---Advertisement---

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వానికి సమగ్ర శిక్ష, కేజీబీవీ కాంట్రాక్ట్ మరియు అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల రూపంలో భారీ నిరసన సెగ తగిలింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు నేడు చలో సీఎం క్యాంపు కార్యాలయానికి పిలుపునిచ్చారు. విజయవాడలోని వీఎంసీ పరిసరాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగులు గుమికూడడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సమగ్ర శిక్ష, కేజీబీవీ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఎన్నికల సమయంలో తమ సమస్యలను పరిష్కరిస్తామని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్నారు. సమ్మె సందర్భంగా ప్రభుత్వం రాసుకున్న మినిట్స్‌ను అమలు చేయాలని నినాదాలు చేస్తూ ఆందోళనను ఉధృతం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 28 వేల మంది ఉద్యోగులు తమ హక్కుల కోసం ఉద్యమ బాట పట్టడం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది.

10 ప్రధాన డిమాండ్లతో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి ఉద్యోగులు సిద్ధమవ్వగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వీఎంసీ నుంచి చంద్రబాబు నివాసం వరకు ర్యాలీ నిర్వహించేందుకు ఉద్యోగులు ప్రయత్నించగా, అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతోనే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ నిరసనలు ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తికి సంకేతమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇప్పుడు ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment