తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (Telangana State Human Rights Commission) తొలి చైర్మన్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య (Justice Chandrayya)(72) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ అపోలో ఆసుపత్రిలో (Banjara Hills Apollo Hospital) చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో న్యాయ రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఆయన అంత్యక్రియలను ఆదివారం ఫిల్మ్‌నగర్‌లోని (Film Nagar) మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన చంద్రయ్య 1954లో జన్మించారు. తల్లిదండ్రులు గుండా బీర్‌పూర్, మార్తమ్మలు.
ప్రాథమిక విద్యను తిమ్మాపూర్ జడ్పీహెచ్ఎస్‌లో పూర్తి చేసిన ఆయన, ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ చదివారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో (Osmania University) ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేసి న్యాయ విద్యలో ప్రావీణ్యం సాధించారు.
1980లో బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకుని తన న్యాయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తర్వాత హైకోర్టు లోక్ అదాలత్ సభ్యుడిగా, పలు జిల్లాల్లో జిల్లా జడ్జిగా, ఏపీ జ్యుడీషియల్ అకాడమీ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొలి లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్‌గా (Legal Services Authority Chairman) సేవలందించిన ఆయన, 2016లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. పదవీ విరమణ తర్వాత 2019లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి 3 ఏళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు.
న్యాయ వ్యవస్థలో నిబద్ధత, పారదర్శకతకు ప్రతీకగా నిలిచిన జస్టిస్ చంద్రయ్య మరణం తెలంగాణ న్యాయ రంగానికి తీరని లోటుగా పలువురు అభిప్రాయపడుతున్నారు.






