ఐపీఎల్ (IPL) 2026 సీజన్ చివరి దశకు చేరుకోవడంతో ప్లేఆఫ్స్ (Playoffs) రేసు మరింత హీట్ ఎక్కింది. ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మధ్య జరగనున్న కీలక పోరుపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ మ్యాచ్‌పై ఉన్న ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం టికెట్ ధరలను అమాంతం పెంచేయడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం టికెట్ ధరలను 50 శాతం నుంచి 110 శాతం వరకు పెంచినట్లు సమాచారం. దీంతో సాధారణ అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా టికెట్ రేట్లపై (Ticket Rates) భారీగా ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మే 15 సాయంత్రం 5 గంటలకు జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లో (Zomato District App) టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది నిమిషాల్లోనే వెయిటింగ్ లిస్ట్ 2.60 లక్షలకు చేరుకోవడం మ్యాచ్‌కు ఉన్న డిమాండ్‌ను స్పష్టంగా చూపించింది. అయితే ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని టికెట్ ధరలను భారీగా పెంచేయడం అభిమానులను షాక్‌కు గురిచేసింది.
ఇప్పటివరకు రూ.950 నుంచి రూ.30000 మధ్య ఉన్న టికెట్ ధరలు ఇప్పుడు రూ.2000 నుంచి రూ.45000 వరకు పెరిగాయి. ముఖ్యంగా సౌత్ ఫస్ట్ టెర్రస్ టికెట్ (South First Terrace) ధర రూ.1500 నుంచి నేరుగా రూ.3000కు పెరగడం అభిమానుల్లో ఆగ్రహానికి కారణమైంది. గతంలో రూ.900 ఉన్న అప్పర్ టియర్ స్టాండ్స్ (Upper Tier Stands) టికెట్లు ఇప్పుడు రూ.2000కు చేరడంతో దాదాపు 110 శాతం పెరుగుదల నమోదైంది. ఇక కార్పొరేట్ బాక్స్ టికెట్లు రూ.30000 నుంచి రూ.45000కు పెరిగాయి.
కొత్త టికెట్ ధరలు కూడా అభిమానులకు భారీ షాక్ ఇస్తున్నాయి. రూ.950 టికెట్ ఇప్పుడు రూ.2000కు, రూ.1500 టికెట్ రూ.3000కు, రూ.1910 టికెట్ రూ.3500కు పెరిగింది. అలాగే రూ.2500 టికెట్ రూ.4500కు, రూ.4500 టికెట్ రూ.6000కు, రూ.7000 టికెట్ రూ.10000కు చేరింది. ఇక రూ.23000 టికెట్ రూ.30000కు, రూ.30000 టికెట్ ఏకంగా రూ.45000కు పెరిగింది.
ఈ భారీ ధరల పెంపుతో సాధారణ అభిమానులకు స్టేడియంలో మ్యాచ్ చూడటం కష్టమైందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. అభిమానుల ప్రేమను క్యాష్ చేసుకునేందుకు ఫ్రాంచైజీలు ఇలా వ్యవహరించడం సరైంది కాదని కామెంట్లు చేస్తున్నారు.






