రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లలో (Paddy Grain Procurement) ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) హైదరాబాద్ సచివాలయం (Hyderabad Secretariat) ప్రధాన ద్వారం వద్ద భారీ ఆందోళన చేపట్టారు. పార్టీ నాయకులు, పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి ఆమె సచివాలయాన్ని ముట్టడించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సచివాలయం పరిసర ప్రాంతాలు నినాదాలతో మార్మోగిపోగా, భారీగా పోలీసులను మోహరించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐకేపీ కేంద్రాల్లో (IKP Centers) వరి ధాన్యం కొనుగోళ్లు తీవ్రంగా ఆలస్యమవుతున్నాయని కవిత మండిపడ్డారు. రైతులు (Farmers) పండించిన పంటను వెంటనే సేకరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. తేమ శాతం, తరుగు పేర్లతో మిల్లర్లు, అధికారులు కలిసి “కటింగ్స్”(Cuttings) పేరిట రైతులను దోచుకుంటున్నారని విమర్శించారు. రైతులకు అండగా నిలిచిన ఆమె.. క్వింటాల్ వరి ధాన్యానికి అదనంగా రూ.500 బోనస్ (Bonus) ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి నిబంధనలు లేకుండా వెంటనే ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
వరి పంటతో పాటు జొన్నలు, పొద్దుతిరుగుడు వంటి ప్రత్యామ్నాయ పంటలకు కూడా కనీస మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కవిత డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఈ పరిస్థితి కొనసాగితే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
నిరసనలో భాగంగా సచివాలయం మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై వరి ధాన్యాన్ని పోసి కవిత వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. దీంతో సచివాలయం వైపు వెళ్లే వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య నెట్టివేతలు, వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. చివరకు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు కవితతో పాటు పార్టీ కార్యకర్తలను బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనాల్లో తరలించారు. అరెస్ట్ సమయంలో రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని కవిత స్పష్టం చేశారు.






