ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం (Coalition Government) నిర్వహించిన మెగా డీఎస్సీ (Mega DSC) స్పోర్ట్స్ కోటా (Sports Quota) నియామకాలపై తీవ్ర వివాదం చెలరేగుతోంది. స్పోర్ట్స్ కోటా పేరుతో భారీ అవకతవకలు జరిగాయని, శాప్ చైర్మన్ రవినాయుడు (Ravi Naidu) ఆధ్వర్యంలో సుమారు రూ.50 కోట్ల అక్రమ వసూళ్లు జరిగాయంటూ పలు వర్గాల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 3 శాతం స్పోర్ట్స్ కోటా కింద 421 పోస్టుల భర్తీ పేరుతో ఒక్కో పోస్టుకు రూ.15 లక్షల చొప్పున వసూళ్లు చేసి అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టారనే విమర్శలు తీవ్ర చర్చకు దారితీశాయి.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన బేరసారాల ఆడియోలు, చర్చలు ఈ వ్యవహారంపై మరింత అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ అక్రమ నియామకాల వెనుక సంబంధిత శాఖలోని పెద్దల పాత్ర కూడా ఉందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది.
ఈ వ్యవహారంపై మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) తీవ్ర స్థాయిలో స్పందిస్తూ స్పోర్ట్స్ కోటాలో నియమించిన 421 మంది అభ్యర్థుల పూర్తి వివరాలు, వారి సర్టిఫికెట్లు (Certificates) వెంటనే ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. నిజాయితీగా నియామకాలు జరిగి ఉంటే మెరిట్ లిస్ట్(Merit List), అర్హతలు(Qualifications), విద్యార్హతల వివరాలు (Educational Qualification Details) ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. లేకపోతే ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
2012 నుంచి అమల్లో ఉన్న 2 శాతం స్పోర్ట్స్ రిజర్వేషన్‌ను 2025లో జీవో నెం.47, జీవో నెం.4 ద్వారా 3 శాతానికి పెంచిన ప్రభుత్వం, టెట్, డీఎస్సీ రాయకుండానే నేరుగా టీచర్ పోస్టులు పొందేలా మార్పులు తీసుకువచ్చిందని విమర్శలు వినిపిస్తున్నాయి. 3.30 లక్షల మంది పోటీ పడుతున్న నియామకాలలో స్పోర్ట్స్ కోటా పేరుతో దొడ్డిదారిన ఎంపికలు జరిగాయని ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా, గతంలో 29 క్రీడలకు మాత్రమే పరిమితమైన స్పోర్ట్స్ కోటాను 67 క్రీడలకు విస్తరించారని, అందులో టెన్నికాయిట్, రబ్బర్ బాల్, తాడు లాగే ఆటలను కూడా చేర్చడం వివాదాస్పదంగా మారిందని. ఈ మార్పులతో అసలు క్రీడాకారుల కంటే అనర్హులకు అవకాశం కల్పించారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
“ఇది మెగా డీఎస్సీ (Mega DSC) కాదు.. మెగా స్కామ్ (Mega Scam)” అంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. నియామకాల ప్రక్రియపై ప్రభుత్వం పూర్తి పారదర్శకత పాటించి నిజాలు బయటపెట్టాలన్న డిమాండ్లు రోజురోజుకు పెరుగుతున్నాయి.






