టాలీవుడ్ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) తాజాగా ఢిల్లీ హైకోర్టును (Delhi High Court) ఆశ్రయించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన వ్యక్తిగత గౌరవం, ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కొన్ని డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, వెబ్సైట్లు తన పేరు, ఫోటోలు, వాయిస్‌ను అనుమతి లేకుండా వాడుతున్నాయని ఆరోపిస్తూ ఆయన ‘పర్సనాలిటీ రైట్స్’(Personality Rights) పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు నాగచైతన్యకు అనుకూలంగా కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తన సినిమాల్లోని సన్నివేశాలను అసభ్యకరంగా మార్చి సోషల్ మీడియా, వెబ్సైట్లలో ప్రచారం చేస్తున్నారని నాగచైతన్య కోర్టుకు వివరించారు. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాయంతో రూపొందించిన డీప్‌ఫేక్స్(Deepfakes), అనధికారిక వీడియోలు, తన పోలికలతో ఉన్న వస్తువులను ఆన్లైన్లో విక్రయించడం వల్ల తన ప్రతిష్టకు తీవ్ర నష్టం జరుగుతోందని పిటిషన్లో పేర్కొన్నారు. కొందరు తన సెలబ్రిటీ హోదాను వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ వ్యక్తిగత జీవితానికీ ఇబ్బందులు కలిగిస్తున్నారని తెలిపారు.
నాగచైతన్య తరఫున సీనియర్ న్యాయవాది వైభవ్ గగ్గర్ (Vaibhav Gaggar) హైకోర్టులో బలమైన వాదనలు వినిపించారు. ఒక వ్యక్తి అనుమతి లేకుండా వారి పేరు, ముఖచిత్రం, వాయిస్‌ను అశ్లీల కంటెంట్ లేదా ప్రకటనల కోసం వినియోగించడం పర్సనాలిటీ రైట్స్‌తో పాటు రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును ఉల్లంఘించడమేనని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ వాదనలను పరిశీలించిన జస్టిస్ (Justice) జ్యోతి సింగ్ (Jyoti Singh) నేతృత్వంలోని ధర్మాసనం నాగచైతన్యకు తాత్కాలిక రక్షణ కల్పించింది. ఆయన పేరు, ఫోటోలు, వాయిస్‌ను దుర్వినియోగం చేస్తున్న అశ్లీల సైట్లు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే నాగచైతన్య వ్యక్తిగత జీవితంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న లింకులను తొలగించాలని ఆదేశిస్తూ ప్రతివాదులందరికీ కోర్టు నోటీసులు పంపింది.
ఇటీవలి కాలంలో బాలీవుడ్, టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఇదే తరహా కేసులతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, అక్కినేని నాగార్జున ఇప్పటికే తమ పర్సనాలిటీ రైట్స్ రక్షణ కోసం కోర్టును ఆశ్రయించగా ఇప్పుడు నాగచైతన్య కూడా అదే బాటలో లీగల్ షీల్డ్ పొందడం ప్రాధాన్యత సంతరించుకుంది.






