పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ‘పెద్ది'(Peddi) చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటివరకు చిత్రబృందం ప్రధానంగా తెలుగు రాష్ట్రాల కంటే ఇతర ప్రాంతాల్లోనే ప్రమోషన్లను నిర్వహించింది. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన మేకర్స్, ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మార్కెట్‌లో బలంగా నిలబెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ఇతర రాష్ట్రాల్లో ప్రచార కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా భారీ స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించాలని చిత్రబృందం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో విజయవాడ (Vijayawada) నగరంలో గ్రాండ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (Grand Pre-Release Event) నిర్వహించేందుకు సిద్ధమైంది. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ వేడుక తేదీ, వేదిక వివరాలను వెల్లడించింది.
చిత్రబృందం వెల్లడించిన వివరాల ప్రకారం జూన్ 1వ తేదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో (Indira Gandhi Stadium) ఫ్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేలాదిమంది అభిమానులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ప్రత్యేక భద్రతా చర్యలను కూడా చేపడుతున్నారు.
అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరవుతారన్న అంశం ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.
పెద్ది చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా నటించగా, దర్శకుడు బుచ్చిబాబు సనా (Buchi Babu Sana) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కథానాయికగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించింది. వృద్ధి సినిమాస్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ (A. R. Rahman) స్వరాలు సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన పొందడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.






