అనంతపురం (Anantapur) నగర శివార్లలోని వనమిత్ర పార్క్లో (Vanamitra Park) చోటుచేసుకున్న ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఓ ప్రైవేట్ ఫార్మసీ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి పార్కుకు వెళ్లగా, ధర్మవరం టీడీపీ(TDP) ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ (Paritala Sriram) అనుచరుడిగా చెప్పబడుతున్న కొక్కంటి హరి (Kokkanti Hari) వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
సమాచారం ప్రకారం, తాను పోలీసు సిబ్బందినని నమ్మబలుకుతూ యువతి, ఆమె స్నేహితుడిని బెదిరించిన నిందితుడు, “మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు.. మిమ్మల్ని విచారించాలి” అంటూ భయాందోళనలకు గురిచేశాడని తెలుస్తోంది. అనంతరం యువతిని (Young Woman) బలవంతంగా పార్క్ సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి (Sexual Assault) యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అయితే యువతి, ఆమె స్నేహితుడు గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం కొక్కంటి హరిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారగా, పోలీసుల పేరును ఉపయోగించి యువతిని మోసం చేసి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికానున్నాయి.






