ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 673 రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా పట్టణ పరిపాలన రంగంలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. “వికసిత్ ఆంధ్రప్రదేశ్” లక్ష్యంగా పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని (పీపీపీ) విస్తృతంగా ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చింది. పట్టణాభివృద్ధికి అవసరమైన సుమారు ₹45 వేల కోట్ల నిధుల కొరతను అధిగమించేందుకు ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వం చెబుతోంది.
జీవో ప్రకారం మున్సిపాలిటీల వద్ద ఉన్న ఖాళీ స్థలాలు, వాణిజ్య సముదాయాలు, బస్టాండ్లు, మార్కెట్లు, కార్యాలయ భవనాలు వంటి ఆస్తులను 33 నుంచి 99 ఏళ్ల వరకు లీజుకు ఇవ్వడానికి అవకాశం కల్పించారు. అలాగే మంచినీటి సరఫరా, డ్రైనేజీ, ఘన వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, పట్టణ రవాణా వంటి కీలక పౌర సేవల్లోనూ ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా మార్గదర్శకాలు రూపొందించారు. సేవల నిర్వహణ ఖర్చులను తిరిగి పొందేందుకు యూజర్ చార్జీలను హేతుబద్ధీకరించాలని కూడా జీవోలో పేర్కొన్నారు.
అయితే ఈ నిర్ణయాలపై ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రతిపక్ష వర్గాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. 99 ఏళ్ల వరకు ప్రభుత్వ ఆస్తులను లీజుకు ఇవ్వడం అంటే ప్రజా ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడమేనని విమర్శిస్తున్నారు. పట్టణ స్థానిక సంస్థల భూములు, పార్కులు, ఆడిటోరియంలు, స్టేడియంలు, కార్యాలయాలు వంటి విలువైన ఆస్తులు కొద్దిమంది బడా సంస్థల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, యూజర్ చార్జీల పేరుతో ఇప్పటికే ఉన్న పన్నులకు అదనంగా చెత్త పన్ను, నీటి చార్జీలు, డ్రైనేజీ ఫీజులు వంటి భారాలు ప్రజలపై పడతాయని విమర్శకులు చెబుతున్నారు. పట్టణ పౌర సేవలను వ్యాపార సరుకులుగా మార్చి సామాన్య ప్రజలపై ఆర్థిక భారం మోపే ప్రయత్నంగా ఈ జీవోను అభివర్ణిస్తున్నారు.
కార్మిక సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మున్సిపల్ సేవలు ప్రైవేటీకరణ దిశగా సాగితే వేలాది మంది ఉద్యోగులు, కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరిస్తున్నాయి. ప్రైవేట్ కంపెనీలకు “వయబిలిటీ గ్యాప్ ఫండింగ్” పేరుతో ప్రభుత్వ నిధులను కేటాయించడం కూడా ప్రజా ధనాన్ని కార్పొరేట్ సంస్థలకు మళ్లించే చర్యగా విమర్శలు ఎదుర్కొంటోంది.
అభివృద్ధి పేరుతో ప్రజా ఆస్తుల ప్రైవేటీకరణకు తెరతీసే చర్య ప్రజలను దీర్గకాలం పట్టిపీడిస్తుందని ప్రజాసంఘాలు ప్రభుత్వ చర్యను నిలదీస్తున్నాయి. ఈ నేపధ్యంలో జీవో 673 అమలు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆస్తులు, పౌర సేవలను కార్పొరేట్ ఆధిపత్యానికి అప్పగించే మార్గంగా మారుతుందా? అనే ప్రశ్నలు ప్రస్తుతం ప్రజల్లో తీవ్ర చర్చకు కారణమవుతున్నాయి.







