విశాఖపట్నం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ ప్రముఖ డాన్స్ మాస్టర్ పండు తీవ్రంగా గాయపడ్డారు. ఆనందపురం సమీపంలో అర్ధరాత్రి 1 గంట తర్వాత ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానికంగా కలకలం రేగింది. ప్రమాదంలో పండు మాస్టర్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మంగళవారం తగరపువలస సమీపంలో నిర్వహించిన ఓ జాతర కార్యక్రమంలో డాన్స్ ఈవెంట్‌కు పండు మాస్టర్ హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం తన బృందంతో కలిసి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ సమయంలో కారులో ప్రయాణిస్తున్న ఓ డ్యాన్సర్‌కు అస్వస్థత ఏర్పడి వాంతులు కావడంతో ఆనందపురం సమీపంలో రోడ్డు పక్కన కారును ఆపినట్లు సమాచారం.
అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన కోళ్ల లోడుతో ఉన్న బొలెరో వాహనం ఆగి ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న ప్రభావంతో కారులో ఉన్న పండు మాస్టర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ముఖ్యంగా రెండు కాళ్లకు బలమైన గాయాలు కావడంతో అక్కడున్న వారు వెంటనే స్పందించి విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో పండు మాస్టర్‌తో పాటు కారులో ఉన్న మరికొందరు సభ్యులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారందరికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటన టాలీవుడ్ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.






