కొరియోగ్రాఫర్, హీరో, దర్శకుడు, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకవైపు కాంచన-4 చిత్రాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు లోకేష్ కనగరాజ్ కథ అందిస్తున్న ‘బెంజ్’ సినిమాలో నటిస్తున్నారు. అలాగే తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘కాలభైరవ’ ప్రాజెక్ట్‌పైనా ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఇదిలా ఉంటే తాజాగా లారెన్స్ కుటుంబం నుంచి మరో కొత్త వ్యక్తి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే సాధారణంగా స్టార్ హీరోల పిల్లలు హీరోలు లేదా హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తుంటే.. రాఘవ లారెన్స్ కూతురు రాఘవి మాత్రం దర్శకురాలిగా ఇండస్ట్రీలోకి రావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
సమాచారం ప్రకారం రాఘవికి చిన్నప్పటి నుంచే సినిమా మేకింగ్‌పై ప్రత్యేక ఆసక్తి ఉండేదట. అదే ఆసక్తితో ఆమె అమెరికాకు వెళ్లి డైరెక్షన్ టెక్నాలజీకి సంబంధించిన ప్రొఫెషనల్ కోర్సును పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అక్కడ నేర్చుకున్న ఆధునిక టెక్నికల్ నాలెడ్జ్‌తోనే ఇప్పుడు మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమవుతున్నారట.
సాధారణంగా దర్శకులుగా మారాలనుకునే వారు 4 నుంచి 5 సంవత్సరాలు పెద్ద దర్శకుల వద్ద అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసి అనుభవం సంపాదిస్తారు. కానీ రాఘవి మాత్రం ఎలాంటి అసిస్టెంట్ డైరెక్టర్ అనుభవం లేకుండానే నేరుగా దర్శకురాలిగా తొలి సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది.
కూతురు ఆసక్తిని గమనించిన రాఘవ లారెన్స్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాఘవి తెరకెక్కించే తొలి సినిమాను స్వయంగా లారెన్స్ తన సొంత బ్యానర్‌లో నిర్మించబోతున్నారట. ఇప్పటికే కథ కూడా సిద్ధమైనట్లు సమాచారం. భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే తన తమ్ముడు ఎల్విన్ లారెన్స్‌ను హీరోగా నిలబెట్టేందుకు రాఘవ లారెన్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూతురు కూడా దర్శకురాలిగా ఇండస్ట్రీలోకి వస్తుండటంతో లారెన్స్ ఫ్యామిలీ నుంచి వరుసగా కొత్త టాలెంట్స్ సినీ రంగంలోకి అడుగుపెడుతున్నట్లైంది.






