తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ (Meteorological Department) చల్లని కబురు అందించింది. 5 రోజుల క్రితం కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) తాజాగా తెలంగాణలోకి ప్రవేశించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తొలకరి జల్లులు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
వాతావరణశాఖ అంచనాల ప్రకారం రాబోయే 3 నుంచి 5 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్ (Hyderabad) పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయని పేర్కొంది.
ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించాయి. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), మహారాష్ట్ర (Maharashtra) ప్రాంతాల్లో దాదాపు 30 శాతం మేర విస్తరణ నమోదైనట్లు వాతావరణశాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో (Bay of Bengal) కూడా నైరుతి ప్రభావం బలంగా కొనసాగుతోందని తెలిపింది.
నైరుతి రాకతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షాలు ఉపశమనం కలిగించనున్నాయి. రైతులు(Farmers) కూడా వానల రాకతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.








