ఖమ్మం జిల్లాలో (Khammam District) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. పెనుబల్లి మండలంలోని కొత్త లంకపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద KVR ప్రైవేట్ ట్రావెల్స్‌కు (KVR Private Travels) చెందిన ఓ బస్సు అదుపుతప్పి రైల్వే బ్రిడ్జిని (Railway Bridge) ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంతో అక్కడ ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఏలూరు జిల్లా చెక్కపల్లి నుంచి హైదరాబాద్‌కు (Hyderabad) వెళ్తుండగా కొత్త లంకపల్లి (Kotha Lankapalli) వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 4 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, మరో 3 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మిగతా ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు.
ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఢీకొన్న ప్రభావంతో ముందు చక్రాలు కూడా ఊడిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.
బస్సు అధిక వేగంతో ప్రయాణిస్తుండటమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. హైస్పీడ్ (High Speed) కారణంగా డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతో రైల్వే బ్రిడ్జిని ఢీకొట్టి బోల్తాపడినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై విచారణ కొనసాగుతోంది.






