తెలంగాణలో (Telangana) సింగరేణి బొగ్గు (Singareni Coal) గనుల వ్యవహారం మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది. సింగరేణిలో (Singareni) రూ.1600 కోట్ల విలువైన భారీ బొగ్గు కుంభకోణం (Coal Scam) జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి (Kishan Reddy) సంచలన లేఖ రాశారు. సీఎం(CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆధ్వర్యంలో 40 లక్షల టన్నుల బొగ్గును మాయం చేశారని, స్టాక్ యార్డుల్లో ఉండాల్సిన బొగ్గును అక్రమంగా విక్రయించారని తీవ్ర ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి సంస్థ వరుస కుంభకోణాలకు కేంద్రబిందువుగా మారిందని కేటీఆర్ విమర్శించారు. నైని కుంభకోణం నుంచి ప్రారంభమైన అక్రమాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని, వందల కోట్ల అవినీతి (Corruption) జరిగినా కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బొగ్గు నిల్వలను తనిఖీ చేయాల్సిన సంబంధిత శాఖలు, కాగ్ అధికారులు (CAG Officials) ఇప్పటి వరకూ ఎందుకు పరిశీలనలు చేయలేదని నిలదీశారు.
సింగరేణి బొగ్గు తెలంగాణ ప్రజల ఆస్తి అని, అలాంటి ఆస్తిని దోచుకుంటుంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని కేటీఆర్ స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సింగరేణి మనుగడనే దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డితో ఎలాంటి మిలాఖాత్ లేకపోతే వెంటనే విచారణకు ఆదేశించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
స్వయంగా కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి ఉన్న సమయంలో రాష్ట్రంలో ఇంత పెద్ద బొగ్గు కుంభకోణం జరగడం సిగ్గుచేటని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి మందమర్రిలో 7.20 లక్షల మెట్రిక్ టన్నులు, శ్రీరాంపూర్‌లో 8 లక్షల మెట్రిక్ టన్నులు, రామగుండం-1లో 6 లక్షలు, రామగుండం-2లో 4 లక్షలు, భూపాలపల్లిలో 5.40 లక్షలు, ఇల్లందులో 3.50 లక్షలు, సత్తుపల్లిలో 2 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయని పేర్కొన్నారు. అయితే కోల్ స్టాక్ పాయింట్ల వద్ద ఆ బొగ్గు కనిపించకపోవడమే ఈ కుంభకోణానికి అతిపెద్ద సాక్ష్యమని ఆరోపించారు.
ఈ వ్యవహారంలో కేంద్రం, రాష్ట్రం కలిసి లక్షల టన్నుల తెలంగాణ బొగ్గును పక్కదారి పట్టించాయనే అనుమానం కార్మిక వర్గాన్ని వెంటాడుతోందన్నారు. ఈ స్కాంను దాచిపెట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్ష బృందాన్ని ఆయా గనుల వద్దకు పంపించాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు.
కోల్ ఇండియా పాటించే ఉత్పత్తి విధానాలు ఏమయ్యాయి? కాంగ్రెస్ హయాంలో సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఎవరి ప్రయోజనాల కోసం జారీ చేశారు? కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను ఎలా పక్కదారి పట్టించారు? అనే అంశాలపై వాస్తవాలను బయటపెట్టకపోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య లోపాయికారి ఒప్పందాలను బయటపెడుతోందని కేటీఆర్ ఆరోపించారు.
40 లక్షల టన్నుల బొగ్గు ఏమైందో వెంటనే సమగ్ర విచారణ జరిపించి నిజానిజాలు బయటపెట్టాలని, బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ భారీ కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ఒకవేళ విచారణ జరపకపోతే కార్మిక లోకంతో కలిసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతుందని హెచ్చరించారు.








