మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), దర్శకుడు పవన్ సాదినేని (Pavan Sadineni) కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆకాశంలో ఒక తార’(Aakasamlo Oka Taara). ఈ సినిమాతో సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయం అవుతోంది. లైట్బాక్స్ మీడియా పతాకంపై సందీప్ గుణ్ణం(Sandeep Gunnam), రమ్య గుణ్ణం(Ramya Gunnam) నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్(Geetha Arts) సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా టీజర్ను (Teaser) తాజాగా చిత్రబృందం విడుదల చేసింది.
“కల తనది.. నమ్మకం కృష్ణది.. కానీ ప్రయాణం వారిద్దరిది” అనే ఆసక్తికరమైన మాటలతో ప్రారంభమైన టీజర్ (Teaser) ఆకట్టుకుంటోంది. చదువుపై ఆసక్తి ఉన్న కల్పన అనే పల్లెటూరి అమ్మాయి జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి ఊరికి పేరు తీసుకొచ్చినట్లు వాయిస్ ఓవర్ ద్వారా పరిచయం చేస్తారు.
“అమ్ములు.. నువ్వు కష్టపడి చదువుతానంటే నేను చదివిస్తా” అంటూ దుల్కర్ సల్మాన్ చెప్పే మాటలు భావోద్వేగాన్ని పంచుతున్నాయి. కృష్ణ పాత్రలో దుల్కర్ ఆకట్టుకోగా, కల్పనగా సాత్విక వీరవల్లి సహజమైన నటనతో మెప్పించింది.
ఆడపిల్ల చదువుపై ఆంక్షలు విధించే పరిస్థితుల్లో కల్పన లక్ష్యానికి కృష్ణ అండగా నిలుస్తాడు. ఆమె కలలను నిజం చేసుకునేందుకు ప్రోత్సహిస్తూ, ఉన్నత స్థాయికి చేరుకునేలా తోడ్పడతాడు. ఒక అమ్మాయి ఆశయం, దానికి తోడుగా నిలిచే వ్యక్తి నమ్మకం ఈ టీజర్లో ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్నాయి.
మరోవైపు, శృతి హాసన్ (Shruti Haasan) సిగరెట్ తాగుతూ మాస్ లుక్లో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భావోద్వేగాలు, ఆశయాలు, బలమైన పాత్రలతో రూపొందిన ఈ టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మరి కల్పన ప్రయాణం వెండితెరపై ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో తెలియాలంటే నవంబర్ 20 వరకు వేచి చూడాలి.







