వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్టును మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో సెంటర్ ఫర్ లిబర్టీ విడుదల చేసిన ప్రకటనను పంచుకుంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ఆ ప్రకటన సారాంశం ప్రకారం.. రెండేళ్ల క్రితం ఒక టెలివిజన్ చర్చలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని “డెలివరీ బాయ్” అని సంబోధించిన వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు నాగార్జున యాదవ్‌ను అరెస్ట్ చేశారని. రాజకీయ ప్రసంగంలో మర్యాదలేని వ్యాఖ్యలు విమర్శలకు గురికావచ్చు గానీ, అలాంటి వ్యాఖ్యల ఆధారంగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పుకొచ్చారు.
తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగానికి చెందిన ఒక రాష్ట్ర కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ఎఫ్ఐఆర్లో ఎటువంటి నిర్దిష్ట అల్లర్లు, శాంతిభంగం లేదా వర్గాల మధ్య ఘర్షణలు జరిగినట్లు పేర్కొనకపోయినా, అల్లర్లు, ప్రజా అశాంతి, శాంతిభంగం, వర్గ విద్వేషాలకు సంబంధించిన పలు సెక్షన్లను ప్రయోగించినట్లు అందులో పేర్కొన్నారని, అంతేకాక, ఈ చర్చను ప్రసారం చేసిన టెలివిజన్ యాంకర్, ఛానల్ నిర్వాహకులు, ఫేస్బుక్ పేజీ నిర్వాహకులపైనా ఈ కేసు ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
“మాటలకు సమాధానం మాటలతోనే చెప్పాలి.. సంకెళ్లతో కాదు” అని పేర్కొంటూ, నాగార్జున యాదవ్‌ను వెంటనే విడుదల చేయాలని, ఆయనపై నమోదైన విచారణను నిలిపివేయాలని, అలాగే పాత్రికేయులు లేదా మీడియా వేదికలపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని సెంటర్ ఫర్ లిబర్టీ ప్రభుత్వాన్ని కోరింది.
ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో చట్టాల దుర్వినియోగం జరుగుతోందంటూ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న ఏబీ వెంకటేశ్వరరావు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ చర్యలపైనా అదే స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారనే అభిప్రాయం ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు, చట్టాల దుర్వినియోగం అంశంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా బహిరంగంగా తప్పుబట్టడం చర్చకు దారితీస్తోంది.







