---Advertisement---

కుప్పం ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ ఔట్‌

June 8, 2026

---Advertisement---

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. కుప్పం నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను బాధ్యతల నుంచి తప్పిస్తూ చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో అనంతపురం జిల్లాకు చెందిన నాయకుడు శ్రీకాంత్‌కు కుప్పం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు.

ఉండవల్లిలో జరిగిన కుప్పం నియోజకవర్గ కీలక నేతల సమావేశంలో చంద్రబాబు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే కంచర్ల శ్రీకాంత్‌ను ఇన్‌చార్జి పదవి నుంచి తప్పిస్తున్నట్లు వెల్లడించిన ఆయన, భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. కొత్త ఇన్‌చార్జిగా నియమితులైన శ్రీకాంత్‌ ఆదేశాల మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కంచర్ల శ్రీకాంత్‌ పార్టీ అధినేత నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపారు. ఇంతకాలం తనకు సహకరించిన కుప్పం నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ సమావేశం నుంచి నిష్క్రమించారు.

చంద్రబాబు 1989 నుంచి కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉండటంతో స్థానిక వ్యవహారాలను పర్యవేక్షించేందుకు గతంలో తిరుపతికి చెందిన మనోహర్‌ను బాధ్యతల్లో ఉంచారు. అనంతరం ఆయన అనారోగ్యానికి గురికావడంతో ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన కంచర్ల శ్రీకాంత్‌కు కుప్పం బాధ్యతలు అప్పగించారు.

అయితే బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసుకోవడంలో కంచర్ల శ్రీకాంత్‌ విఫలమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆయన వ్యవహార శైలిపై పార్టీ నాయకుల నుంచి ఫిర్యాదులు పెరగడంతో మార్పు అవసరమని చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనను తప్పించి కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలని నిర్ణయించారు.

కొత్తగా నియమితులైన శ్రీకాంత్‌ విజయవాడలోని ప్లానింగ్‌ కార్యాలయంలో ఇంజనీర్‌గా పనిచేసిన అనుభవం కలిగి ఉన్నారు. ప్రస్తుతం టీడీపీ చేపట్టిన పీ-4 కార్యక్రమంలో హిందూపురం నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. ఇప్పుడు కుప్పం బాధ్యతలు చేపట్టడంతో అక్కడ పార్టీ బలోపేతం, స్థానిక నాయకత్వ సమన్వయం వంటి అంశాలపై ఆయన ఎలా ముందుకెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment