ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)లో(APPSC) అక్రమాలు జరిగాయంటూ కూటమి ప్రభుత్వం(Coalition Government) చేస్తున్న ఆరోపణలకు వైఎస్సార్సీపీ(YSRCP) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) తన ప్రెస్మీట్లో పాయింట్ బై పాయింట్‌గా సమాధానం ఇచ్చారు. ఎక్కడా ఒక్క తప్పు కూడా జరిగి ఉంటే నిరూపించాలని, అవసరమైతే కేసును సీబీఐ విచారణకు అప్పగించాలని చంద్రబాబు ప్రభుత్వానికి(Chandrababu Government) సవాల్ విసిరారు.
డిజిటల్ ఎవాల్యుయేషన్(Digital Evaluation) నుంచి గ్రూప్-1 పరీక్షల నిర్వహణ వరకు, జవాబు పత్రాల ట్యాంపరింగ్(Answer Sheet Tampering) ఆరోపణల నుంచి OMR షీట్ల మార్పులు, ఇంటర్వ్యూ మార్కుల వరకు కూటమి చేస్తున్న ప్రతి ఆరోపణపై జగన్ వివరణ ఇచ్చారు.
కరోనా మహమ్మారి(COVID-19 Pandemic) సమయంలో జరిగిన డిజిటల్ ఎవాల్యుయేషన్ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు ఆ విధానాన్ని పరిగణనలోకి తీసుకోలేదని, మాన్యువల్ ఎవాల్యుయేషన్ ద్వారానే ప్రక్రియ పూర్తయిందని జగన్ తెలిపారు. గ్రూప్-1 జవాబు పత్రాల మూల్యాంకనాన్ని పూర్తిస్థాయిలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించామని చెప్పారు.
జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ జరిగిందన్న ఆరోపణలను కూడా జగన్ ఖండించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్(SIT) నివేదికలోనే జవాబు పత్రాల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు జరగలేదని స్పష్టమైందని పేర్కొన్నారు. OMR షీట్లను గుర్తుతెలియని వ్యక్తులు సవరించారన్న ప్రచారానికీ సిట్ నివేదిక, సీఎల్ఎఫ్ రిపోర్టులు, సీసీ కెమెరా ఆధారాలు సమాధానం చెబుతున్నాయని అన్నారు.
పరీక్షా పత్రాల మూల్యాంకనంలో ఒకటి కంటే ఎక్కువసార్లు పరిశీలించడం సాధారణ ప్రక్రియ అని జగన్ వివరించారు. అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ఉండేందుకే మల్టిపుల్ ఎవాల్యుయేషన్ విధానం ఉంటుందని, పేపర్లపై పేర్లకు బదులుగా బార్కోడ్ ఉండటం వల్ల మూల్యాంకనం చేసే వారికి అభ్యర్థి వివరాలు తెలియవని తెలిపారు.
రిటన్ టెస్ట్‌లో తక్కువ మార్కులు వచ్చిన వారికి ఇంటర్వ్యూలో అధిక మార్కులు ఇచ్చారన్న ఆరోపణలపై కూడా జగన్ స్పందించారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూల పూర్తి వివరాలను బయటపెట్టాలని సవాల్ విసిరారు. తమ ప్రభుత్వ హయాంలోనే ఏపీపీఎస్సీలో పలు సంస్కరణలు తీసుకొచ్చామని, ఫేషియల్ రికగ్నిషన్, బయోమెట్రిక్ థంబ్ ఇంప్రెషన్, సీసీ కెమెరాల వంటి భద్రతా చర్యలు అమలు చేశామని చెప్పారు.
గతంలో ఒకే ఇంటర్వ్యూ బోర్డు ఉండగా, తమ హయాంలో మూడు ఇంటర్వ్యూ బోర్డులను ఏర్పాటు చేసి 24 మంది సివిల్ సర్వీసు అధికారులతో జంబ్లింగ్ పద్ధతిలో ఇంటర్వ్యూలు నిర్వహించామని జగన్ వివరించారు. అభ్యర్థికి ఏ బోర్డు, ఏ అధికారి ఇంటర్వ్యూ చేస్తారో ముందుగా తెలియని విధంగా వ్యవస్థను రూపొందించామని తెలిపారు.
తమ ప్రభుత్వ హయాంలో 1.30 లక్షలకుపైగా సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని, ఏపీపీఎస్సీ ద్వారా 78 నోటిఫికేషన్లు విడుదల చేశామని, వాటిలో ఎక్కడైనా ఒక్క అక్రమ ఆరోపణ నిరూపితమైందా అని జగన్ ప్రశ్నించారు.
ఎవాల్యుయేటర్లు ఫోన్లు మాట్లాడారన్న ఆరోపణలపైనా స్పందిస్తూ, మూల్యాంకన సమయంలో అభ్యర్థుల వ్యక్తిగత వివరాలు ఎవరికీ తెలియవని, బార్కోడ్ విధానం కారణంగా అభ్యర్థిని గుర్తించే అవకాశం ఉండదని స్పష్టం చేశారు.
మొత్తంగా ఏపీపీఎస్సీ అక్రమాల పేరుతో జరుగుతున్న ప్రచారానికి సిట్ నివేదికలు, కోర్టు ప్రక్రియ, తమ హయాంలో అమలు చేసిన సంస్కరణల ఆధారంగా జగన్ సమాధానం ఇచ్చారు. నిజంగా అక్రమాలు జరిగాయని ప్రభుత్వం భావిస్తే డీఎస్సీతో పాటూ ఏపీపీఎస్సీ వ్యవహారం కూడా సీబీఐ విచారణకు ఆదేశించి నిజానిజాలు తేల్చాలని ఆయన సవాల్ విసిరారు.







