హన్మకొండ కలెక్టరేట్ వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా, టీఎన్జీఓ నేతలు చేపట్టిన ధర్నాకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తనను అడ్డుకోవడంపై హరీశ్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అనంతరం సుబేదారి పోలీస్ స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లారు. హరీశ్ రావు అరెస్ట్ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష నేతలను అడ్డుకోవడం సరికాదని, ప్రభుత్వం పోలీసుల ద్వారా నిర్బంధాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
మరోవైపు వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు తమ సమస్యలను పరిష్కరించాలని, జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. వారి ఆందోళనకు మద్దతుగా టీఎన్జీఓలు కూడా ధర్నా నిర్వహించారు.
హరీశ్ రావు హన్మకొండ పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్దే అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ పోలీసుల ఆంక్షలను దాటుకుని హన్మకొండ కలెక్టరేట్‌కు చేరుకున్న హరీశ్ రావు.. విద్యార్థుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు.
హరీశ్ రావు కలెక్టరేట్ వద్దకు చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు భారీగా బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా హరీశ్ రావును అరెస్ట్ చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.








