హర్యానాకు చెందిన ప్రముఖ గాయకుడు, యూట్యూబర్ అంకిత్ బాల్యన్ (32) ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం సాయంత్రం జిమ్ నుంచి బయటకు వచ్చిన ఆయనపై రెండు బైక్‌లపై వచ్చిన నలుగురు దుండగులు సమీపం నుంచి కాల్పులు జరిపారు. దాదాపు 18 రౌండ్ల కాల్పులు జరిగినట్లు సమాచారం.
వాహనం వద్దే దాడి
అంకిత్ తన స్కార్పియో వాహనం వద్దకు వెళ్తుండగా దుండగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కారు తలుపు తెరిచి వరుసగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఆయన తల, కడుపు ప్రాంతాల్లో 5 తూటాలు తగిలాయి. మరో 3 తూటాలు కారు ముందు అద్దానికి తగిలాయి. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి తరలించేలోపే అంకిత్ మృతి చెందారు.
పోలీసుల దర్యాప్తు
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. జిమ్ పరిసరాల్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. పాత కక్షలు, హర్యానాతో సంబంధాలు, రాజకీయ వివాదాల కోణాల్లో విచారణ కొనసాగుతోంది.
అంకిత్ హత్యకు నిరసనగా కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఢిల్లీ-ముజఫర్‌నగర్ రహదారిపై ఆందోళన చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కుమారుడి మృతదేహాన్ని ఒడిలో పెట్టుకుని ఆయన తల్లి విలపించిన దృశ్యాలు తీవ్ర విషాదాన్ని నింపాయి.
యోగి సర్కార్‌పై అఖిలేష్ ఫైర్
షామ్లీ జిల్లా బంటిఖేడా గ్రామానికి చెందిన అంకిత్‌కు యూట్యూబ్‌లో 3.66 లక్షలకు పైగా చందాదారులు ఉన్నారు. “భరీ కోర్ట్ మే గోలీ మారేంగే మేరీ జాన్” పాటతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జిల్లా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అంకిత్ హత్యపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.








