హైదరాబాద్ (Hyderabad) సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber Crime Police) 1980s ఫోటో ట్రెండ్‌పై (1980s Photo Trend) ప్రజలను అప్రమత్తం చేశారు. 1980s లేదా రెట్రో ఫోటో పేరుతో వ్యక్తిగత చిత్రాలను తెలియని వ్యక్తులు, అనుమానాస్పద వెబ్‌సైట్లతో పంచుకోవద్దని సూచించారు. ముఖ్యంగా ఈ ట్రెండ్ పేరుతో వచ్చే అనుమానాస్పద ఏపీకే ఫైళ్లను (Suspicious APK Files) డౌన్‌లోడ్ చేయవద్దని హెచ్చరించారు.
తెలియని యాప్‌లను (Unknown Apps) మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేస్తే ఫోన్‌లోని ఫోటోలు, వ్యక్తిగత సమాచారం, ఇతర డేటా సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు. వ్యక్తిగత ఫోటోలను వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేసే ముందు వాటి భద్రత, విశ్వసనీయతను పరిశీలించాలని సూచించారు.
ఫోటోలు బయటకు వెళ్తే వాటిని కృత్రిమ మేధస్సు ఆధారిత సాధనాలతో(AI Tools) మార్ఫింగ్ (Morphing) చేసి నకిలీ చిత్రాలు, వీడియోలు రూపొందించే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. వాటిని ఉపయోగించి బాధితులను బెదిరించడం లేదా వేధింపులకు గురిచేసే ప్రమాదం ఉందని తెలిపారు.
ఇతరుల ఫోటోలను వారి అనుమతి లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని సూచించారు. 1980s ఫోటో ట్రెండ్ పేరుతో వచ్చే అనుమానాస్పద లింకులు, సందేశాలు, ఏపీకే ఫైళ్లను తెరవకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు.
ఇప్పటికే అనుమానాస్పద యాప్‌ను డౌన్‌లోడ్ చేసి ఉంటే వెంటనే తొలగించి, మొబైల్ అనుమతులతో పాటు బ్యాంకింగ్, వ్యక్తిగత ఖాతాలను పరిశీలించాలని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేసి, అవసరమైతే సమీపంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు.
సోషల్ మీడియా ట్రెండ్‌ల కంటే వ్యక్తిగత భద్రతకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేశారు.








