---Advertisement---

టీడీపీకి బీ-టీమ్ కాదని క్యాడర్‌ను నమ్మించే ప్రయత్నంలో జనసేన నాయకత్వం?

August 18, 2026

Summarize with AI

---Advertisement---

“టీడీపీ(TDP) పార్టీకి కాపు కాయడానికి జనసేన పార్టీ (Jana Sena Party) పెట్టలేదు. పవన్ కల్యాణ్‌ను(Pawan Kalyan) ముఖ్యమంత్రిని(CM) చేయడానికి జనసేన పెట్టారు” అంటూ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ (Pantham Nanaji) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జనసేనది ప్రత్యేక రాజకీయ అస్తిత్వమని చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, గత 12 ఏళ్ల రాజకీయ ప్రయాణాన్ని పరిశీలిస్తే ఆ పార్టీ మొత్తం టీడీపీకి(TDP) బీ-టీమ్‌గానే (B-Team) గుర్తింపు పొందిందనే విమర్శలు ఉన్నాయి.

జనసేన పార్టీ 2014 నుంచి 2026 వరకు సాగించిన రాజకీయ ప్రయాణంలో టీడీపీతో పొత్తులు, మద్దతు, రాజకీయ అనుబంధం కీలకంగా కొనసాగాయి. 2014లో టీడీపీ–బీజేపీ(TDP-BJP) కూటమికి మద్దతు ఇచ్చిన జనసేన.. 2019లో టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చి లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోనే టీడీపీకి దూరంగా ఉన్నట్లు ప్రచారం చేసుకుని విడిగా పోటీ చేసింది. అయితే 2024లో మరోసారి టీడీపీ–బీజేపీతో కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చింది.

అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలుమార్లు చంద్రబాబు నాయకత్వాన్ని (Chandrababu Leadership) బహిరంగంగా సమర్థించారు. ఒక దశలో మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబే ముఖ్యమంత్రిగా కొనసాగాలని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై జనసేనలోని ఒక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గంలోనూ (Kapus) అసంతృప్తి వ్యక్తమైందనే రాజకీయ చర్చ జరిగింది.

ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు “జనసేన టీడీపీకి బీ-టీమ్ కాదు” అంటూ జనసేన ఎమ్మెల్యేలు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయడం ఆసక్తికరంగా మారింది. నిజంగా జనసేన స్వతంత్ర రాజకీయ పార్టీ అయితే, గతంలో టీడీపీకి అనుకూలంగా చేసిన పలు ప్రకటనలకు ఇప్పుడు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

ఇటీవల జనసేన పార్టీ శాసనసభాపక్ష నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తే అన్నింటినీ గెలిచి జనసేన బలాన్ని చూపించాలని వ్యాఖ్యానించినట్లు చర్చ జరిగింది. ఈ వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తల్లోనే అసంతృప్తి వ్యక్తమైందనే ప్రచారం వచ్చింది. దీంతో అనంతరం జనసేనకు వచ్చే సీట్లు తమ పార్టీ బలాన్ని బట్టి ఉండాలనే విధంగా వివరణలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విశ్లేషణలు వినిపించాయి.

మరోవైపు కూటమి ప్రభుత్వంలో (Coalition Government) జనసేనకు, టీడీపీకి మధ్య ప్రస్తుతం రాజకీయ సమన్వయం ఎలా కొనసాగుతోంది అన్నదానిపైనా చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ కీలక అసెంబ్లీ, కేబినెట్, కలెక్టర్ సమావేశాలకు హాజరు కాకపోవడం, తన అన్న నాగబాబుకు మంత్రి పదవి విషయంలో ఆలస్యం జరగడం, ప్రభుత్వ వ్యవహారాల్లో నారా లోకేష్‌కు(Nara Lokesh) ప్రాధాన్యం పెరగడం వంటి అంశాలు జనసేన రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతున్నాయి.

2014లో పార్టీ స్థాపించిన రోజు నుంచి 2026 వరకు జనసేన తన స్వతంత్ర రాజకీయ గుర్తింపును పూర్తిస్థాయిలో సంపాదించలేదనే విమర్శలు ఉన్నాయి. 12 ఏళ్ల తరువాత ఇప్పుడు “టీడీపీకి బీ-టీమ్ కాదు” అని ప్రకటనలు చేయడం కంటే, టీడీపీకి భిన్నంగా జనసేన తీసుకున్న నిర్ణయాలు, సాధించిన రాజకీయ విజయాలు, స్వతంత్రంగా అమలు చేసిన విధానాలను ప్రజలకు వివరించడం ద్వారా తాము 12 ఏళ్లలో ఒక రాజకీయ పార్టీగా ఏం సాధించామో చెప్పాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే 12 ఏళ్ల రాజకీయ ప్రయాణం తర్వాత కూడా “జనసేన టీడీపీకి బీ-టీమ్ కాదు” అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి రావడం వెనుక అసలు కారణం ఏమిటనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది జనసేన నాయకత్వమేనని ఆ పార్టీ సానుభూతిపరుల నుంచి వినిపిస్తున్న మాట.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment