తెలంగాణ రాజకీయాల్లో(Telangana Politics) కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మంత్రి కొండా సురేఖను(Konda Surekha) మంత్రివర్గం నుంచి తప్పించే అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం (Congress High Command) తుది నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy), కాంగ్రెస్ ముఖ్య నేతలు అధిష్ఠానంతో జరిపిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్న అనంతరం కొండా సురేఖ బర్తరఫ్‌కు(Dismissal) సంబంధించిన లేఖను లోక్‌భవన్‌కు(Lok Bhavan) పంపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖ, చిన్నారెడ్డి(Chinna Reddy) వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ముఖేష్ కుమార్ గౌడ్(Mukesh Kumar Goud), రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) సహా పలువురు సీనియర్ నేతల అభిప్రాయాలను అధిష్ఠానం సేకరించినట్లు సమాచారం.
ఒకవేళ కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తే రాష్ట్రంలో ఏర్పడే రాజకీయ సమీకరణాలపై కాంగ్రెస్ అధిష్ఠానం ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 3 బీసీ మహిళా నేతలకు కీలక పదవులు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవితో పాటు మరో 2 కీలక పదవులను బీసీ మహిళా నేతలకు అప్పగించే అంశంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పదవులకు సంబంధించి పలువురు పేర్లను పార్టీ సీనియర్ నేతల నుంచి అధిష్ఠానం సేకరిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణలో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కొత్త నియామకాలు చేపట్టాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే 3 కీలక పదవులకు ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకోబోయే తదుపరి నిర్ణయంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.







