సింగరేణి (Singareni) ప్రతిపాదించిన ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని (Open-Cast Coal Mine) అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. రామప్ప దేవాలయం (Ramappa Temple) సమీపంలో బొగ్గు తవ్వకాలు(Coal Mining), బ్లాస్టింగ్‌లు(Blasting) చేపడితే చారిత్రక కట్టడంతో పాటు రామప్ప చెరువుకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై కాంగ్రెస్ (Congress) ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు.
భూములను (Lands) దోచుకోవడం పూర్తయిందని, ఇప్పుడు భూమిలోపల ఉన్న సంపదపై (Underground Resources) కన్నేశారని కేటీఆర్ ఆరోపించారు. రామప్ప దేవాలయానికి సమీపంలో ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాకతీయుల శిల్పకళకు (Kakatiyas Architecture) ప్రతీకగా నిలిచిన రామప్ప దేవాలయానికి 2021లో యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా లభించింది. రామప్ప చెరువు పరిసరాలతో అనుసంధానమై ఉన్న ఈ ప్రాంతం చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యతను కలిగి ఉంది.
రామప్పకు సమీపంలో లోతైన తవ్వకాలు, బ్లాస్టింగ్‌లు నిర్వహిస్తే ఆలయం, చెరువు భద్రతపై ప్రభావం పడే అవకాశం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే మైనింగ్ ప్రాజెక్టు (Mining Project) వల్ల ఆలయానికి ముప్పు ఉండదని సింగరేణి వర్గాలు గతంలో వెల్లడించాయి. మైనింగ్‌కు సంబంధించి శాస్త్రీయ, పర్యావరణ అధ్యయనాలు పూర్తయ్యే వరకు ముందుకు వెళ్లబోమని ములుగు జిల్లా అధికారులు కూడా స్పష్టం చేశారు.
రామప్ప దేవాలయానికి హాని కలిగించే ఎలాంటి చర్యలనైనా బీఆర్ఎస్(BRS) వ్యతిరేకిస్తుందని కేటీఆర్ తెలిపారు. ఓపెన్‌కాస్ట్ బొగ్గు గని ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు.
భూములు దోచుకోవడం అయిపోయింది.. ఇప్పుడు భూముల లోపల ఉన్న సంపద దోచుకొని, వారసత్వ కట్టడాలను కూల్చడానికి రేవంత్ సర్కార్ కుట్రలు పన్నుతుంది. రామప్ప దేవాలయానికి అతి సమీపంలో ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవడం దారుణం. మీటర్ల కొద్ది లోతులో తవ్వకాలు, బ్లాస్టింగ్స్ చేయడం వల్ల తెలంగాణ శిల్పకళకు ప్రతిరూపం, యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి, రామప్ప చెరువుకు తీవ్ర ముప్పు వాటిల్లనుంది. వారసత్వ సంపదను ధ్వంసం చేసే ఈ కుట్రలను బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ప్రఖ్యాత రామప్ప దేవాలయానికి హాని చేసే ఓపెన్ కాస్ట్ బొగ్గు గని ప్రతిపాదనను వెంటనే వెనక్కి తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాం.
— KTR (@KTRBRS) October 5, 2026







