రిటైర్డ్ ఐఏఎస్ అధికారి (Retired IAS Officer) డాక్టర్ పి.వి. రమేష్(P.V.Ramesh) తాజాగా ఓ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో అమరావతి రాజధాని (Amaravati Capital City) నిర్మాణంపై (Construction) చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పరిపాలనా వ్యవస్థలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన, అమరావతి ప్రణాళిక, విస్తీర్ణం, అభివృద్ధి నమూనాపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
అమరావతి నిర్మాణం కోసం సుమారు 50,400 ఎకరాల భూమిని (Acres Land) కేటాయించగా, ప్రపంచ ప్రఖ్యాత నగరమైన మాన్హాటన్ (Manhattan) కేవలం 15,400 ఎకరాల్లోనే విస్తరించి ఉందని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికే భారీ స్థాయిలో భూములు సమీకరించినప్పటికీ(Land Pooling), ఇంకా మరింత భూమి అవసరమని చెప్పడం పలు ప్రశ్నలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు.
అమరావతి అభివృద్ధి (Amaravati Development) క్రమంగా రియల్ ఎస్టేట్ గేమ్ (Real Estate Game) గా మారుతోందనే అభిప్రాయాన్ని పి.వి. రమేష్(P.V. Ramesh) వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ భూములను కేవలం ఆస్తుల కోణంలో చూస్తే నిజమైన ప్రజా రాజధాని నిర్మాణం సాధ్యం కాదని ఆయన హెచ్చరించారు.
ఒక రాజధాని నగరం కేవలం ధనికులు లేదా ఉన్నత వర్గాల కోసం కాకుండా, పేదలు, మధ్యతరగతి, ఉద్యోగులు, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన పేర్కొన్నారు. కేవలం ఎలైట్ వర్గాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించే నగరం ఎప్పటికీ “ప్రజల నగరం”(People’s City) కాలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
రాజధాని అంటే కేవలం భవనాల సముదాయం లేదా భూముల వ్యాపారం కాదని, అది ఉపాధి, పెట్టుబడులు, సేవలు, జీవన ప్రమాణాలను మెరుగుపరిచే సజీవ ఆర్థిక కేంద్రం కావాలని ఆయన అన్నారు. అభివృద్ధిలో ఈజ్ ఆఫ్ లివింగ్ (Ease of Living) కు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రజల అవసరాలకు అనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దాలని సూచించారు.
సుమారు 40 ఏళ్ల పరిపాలనా అనుభవం కలిగిన పి.వి. రమేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో (Andhra Pradesh Government) ఫైనాన్స్ సెక్రటరీ (Finance Secretary) సహా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. అలాగే ఐక్యరాజ్యసమితి, వరల్డ్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ సంస్థల్లో సేవలందించడంతో పాటు ఆసియా, ఆఫ్రికా, పశ్చిమ ఆసియా, యూరప్, ఉత్తర మరియు దక్షిణ అమెరికా దేశాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పనిచేశారు. మహిళా సాధికారతపై (Women Empowerment) డొమినికన్ రిపబ్లిక్‌లో (Dominican Republic) ఒక పుస్తకాన్ని కూడా రచించారు.
ఇలాంటి విస్తృత పరిపాలనా, అంతర్జాతీయ అనుభవం ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి అమరావతి అభివృద్ధి రియల్ ఎస్టేట్ కోణంలో సాగుతోందని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వర్గాల్లో విస్తృత చర్చకు దారితీశాయి.






